
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. నియోజక వర్గాలు పెరిగినప్పుడు సింగరేణి కార్మికులు కూడా అక్కడినుంచి ప్రాతినిథ్యం వహించాలని సూచించారు. మీరంతా కలిసి వుంటే వేరే సంఘానికి అవకాశం కూడా రాదని.. గ్యాప్ వున్నప్పుడే వేరే వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తారని తెలిపారు.
ఎమ్మెల్యే, ఎంపీ లు కార్మికుల సమస్యలు వుంటే ఇన్వాల్వ్ కావాలని సూచించారు మంత్రి కేటీఆర్. స్థానిక ప్రజాప్రతినిధులు సింగరేణి కార్మికులను కలుపుకొని పోవాలన్నారు. ఈ మధ్య మార్కెట్ లోకి కొత్త బిచ్చ గాళ్లు వచ్చారని.. ఏనుగు పోతుంటే కుక్కలు మస్తుగా అరుస్తాయన్నారు. నిన్న మొన్న పదవులు వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు కేసీఆర్ ను తిడితే పెద్ద వాళ్ళమయిపోతాం అనుకుంటున్నారు...కేసీఆర్ కన్నా తెలంగాణ ను ఎక్కువ ప్రేమిస్తే అప్పుడు లీడర్లు అవుతారన్నారు.
బీజేపీ నేతలు దుబ్బాక లో గెలిచి..GHMC లో నాలుగు సీట్లు గెలవగానే ఎగిరెగిరి పడ్డారన్న మంత్రి కేటీఆర్.. ఆ తర్వాత వచ్చిన మూడు ఎన్నికల్లో ఏమైందని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ లో అందరూ వచ్చి ప్రచారం చేస్తే టీఆర్ఎస్ కు వచ్చిన మెజార్టీ లో సగం ఓట్లు కూడా బీజేపీకి రాలేదన్నారు. ప్రజలు కలలుగన్న తెలంగాణ రావాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు నమ్మారని అన్నారు.
పాదయాత్ర చేస్తానంటున్న బీజేపీ అధ్యక్షుడు..ఊరూరా తిరిగి చూడాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో గ్రామాలు ఎలా ఉన్నాయో..తెలంగాణలో ఎలా ఉన్నాయో చూసి చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా ఉందంటున్నారు బీజేపీ నేతలు. అదే నిజమైతే మీ పార్టీ ప్రభుత్వాలు వున్న దగ్గర ..ఇక్కడ అమలు అవుతున్న పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తానంటున్న బీజేపీ అధ్యక్షుడు..రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా అని అన్నారు.
మరోవైపు..రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనలో తెలుగు దేశం వాసన పోతలేదన్నారు. టీపీసీసీ అయితేనే.. ప్రధాన మంత్రి అయినైంత బిల్డప్ ఇస్తున్నాడన్నారు. ఆయన ఏ పార్టీ కి అధ్యక్షుడు అయ్యిండో ఎవరికి అర్థం కావటం లేదన్నారు కేటీఆర్. రెడ్ హ్యాండెడ్ గా దొరికి చంచల్ గుడా జైల్ కు వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డికి .. కేసీఆర్ పై విమర్శలు చేసే అర్హత ఉందా అని అన్నారు.