నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దు:ఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని గుర్తు చేశారు.
— Telangana CMO (@TelanganaCMO) April 24, 2026
మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
శంకర్ గౌడ్ బలవన్మరణం అత్యంత బాధాకరం..
నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు..చర్చలు చేసి పరిష్కరించుకోవాలన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తోందన్నారాయన. శంకర్ గౌడ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి సానుభూతి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారు మహేష్ కుమార్ గౌడ్.

