డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు అటకెక్కిందో చెప్పాలె 

డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు అటకెక్కిందో చెప్పాలె 

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు విచారణపై  పీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక రాష్ట్ర  ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. డ్రగ్స్ కేసు విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో గుట్కా, మట్కా, గుడుంబా, పేకాట లేదని కేసీఆర్ చెబుతున్నారని అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి విద్యా సంస్థల్లో విజృంభిస్తోందని, కాలేజీల్లోనే కాదు.. స్కూల్స్లోనూ విచ్చలవిడిగా దొరుకుతున్న విషయాన్ని  ఆయన ప్రస్తావించారు. డ్రగ్స్ గురించి మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని కేటీఆర్, బాల్క సుమన్ లాంటి వాళ్లు ప్రగల్భాలు పలుకుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2017 నాటి డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు అటకెక్కిందని, అకున్ సభర్వాల్ ను అర్థాంతరంగా ఎందుకు బదిలీ చేశారని ఆయన ప్రశ్నించారు.

డ్రగ్స్ వ్యవహారంపై అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసినా.. హైకోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండాపోయిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం విచారణను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. ఎక్సైజ్ శాఖ వద్ద అన్ని ఆధారాలున్నా ఈడీకి ఇచ్చేందుకు నిరాకరిస్తోందని.. దీనిపై కేంద్రం వెంటనే స్పందించి స్వతంత్ర విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 12నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్న ఆయన.. అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతుచూస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం..

అదేం నా సొంత ప్రసంగం కాదు

గుజరాత్పై కన్నేసిన ఆమ్ ఆద్మీ