- ఈ ఏడాదే ప్రారంభం.. ఆరుట్ల మోడల్‌లో సకల వసతులు
- హైదరాబాద్ బయట ఒక్కో నియోజకవర్గానికి ఒకటి
- ఏడాదిలోగా సిటీలో 12 కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు
- వచ్చే ఏడాది నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్
- ఫీజుల నియంత్రణకు స్టేట్ కమిటీ విద్యా శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
- ఆకునూరి మురళీ కమిషన్ నివేదికపై కేకే నేతృత్వంలో కమిటీ
హైదరాబాద్, వెలుగు: వచ్చే అకడమిక్ ఇయర్లో రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని స్కూల్ తరహాలో క్లాస్ రూములు, గ్రౌండ్, ట్రాన్స్ పోర్టు ఫెసిలిటీ, టీచింగ్ స్టాఫ్ ఉండేలా వాటిని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యా శాఖపై అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
నాణ్యమైన విద్య కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు.హైదరాబాద్ చుట్టూ ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలని ఇంజినీర్లను ఆదేశించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, భారతీయ విద్యా భవన్ తరహాలో సకల వసతులతో 12 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో మరో 17 స్కూళ్లను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు 164 బడుల్లో అదనపు గదుల నిర్మాణంలో ఎక్కడా రాజీపడవద్దని వెల్లడించారు.
స్టూడెంట్ కిట్లలో బూట్లు, డిక్షనరీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైమరీ స్థాయి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ ఉదయం ‘బ్రేక్ ఫాస్ట్’ అందించాలని సీఎం ఆదేశించారు. ఇందులో పాలు కూడా ఇవ్వాలని, వాటిని విజయ డెయిరీ నుంచే సేకరించాలని సూచించారు. ఇకపై విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలతో పాటు ప్రత్యేక ‘స్టూడెంట్ కిట్’ ఇవ్వనున్నామని తెలిపారు. దాంట్లో బ్యాగు, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సు, రంగుల పెన్సిళ్లతో పాటు బూట్లు, సాక్సులు, డిక్షనరీ కూడా ఉండాలని చెప్పారు.
దీనికి సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్లో పొందుపర్చాలని అధికారులను ఆదేశించారు. కాగా.. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై అధికారులు నివేదిక ఇచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈఓలు స్కూళ్లను పరిశీలించి ఫీజులపై నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఉండే కమిటీదే ఫీజుల విషయంలో తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఫీజుల ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి పేరెంట్స్, సామాజికవేత్తలు, మేధావుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు.
టీచర్లకు ఏఐ ట్రైనింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నందున.. టీచర్లు, లెక్చరర్లకు ఏఐపై షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాలిటెక్నిక్, ఏటీసీల్లో ఏఐ కోర్సులు ప్రవేశపెట్టాలని, కాలం చెల్లిన కోర్సులను ఎత్తేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు నిధులు కేటాయిస్తామని, ఇప్పటికే ఓయూకు వెయ్యి కోట్లు కేటాయించామని సీఎం గుర్తుచేశారు. మిగిలిన వర్సిటీలకు ఎన్ని నిధులు అవసరనమే దానిపై సమగ్ర నివేదిక అందించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని సీఎం ఆదేశించారు. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో స్కిల్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
నివేదికపై కేకే కమిటీ..
ఆకునూరి మురళీ నేతృత్వంలోని విద్యా కమిషన్ ‘తెలంగాణ విద్యా విధానం’ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించింది. అమెరికా, వియత్నాం, మలేషియా సహా పలు దేశాల్లో పర్యటించి ఈ రిపోర్టును తయారు చేశారు. దీన్ని పరిశీలించి చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వెంటనే అమలు చేయాల్సిన అంశాలను వేరుచేసే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు కేశవరావు కమిటీకి సీఎం అప్పగించారు. ప్రభుత్వ 99 రోజుల ప్రణాళికలో వారం రోజులు విద్యకే కేటాయించాలని సీఎం సూచించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ, టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, వీసీ మొలుగరం కుమార్, ఘంటా చక్రపాణి, విద్యా కమిషన్ సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రెడ్డి, చారకొండ వెంకటేశ్, జ్యోత్య్న శివారెడ్డి, పద్మజా షా తదితరులు పాల్గొన్నారు.
