తెలంగాణ తల్లి ఎవరో చెప్పిన రేవంత్

తెలంగాణ తల్లి ఎవరో చెప్పిన రేవంత్

హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవం ఉండేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో గొడవలైతే.. పోలీస్ స్టేషన్ లో స్థానిక ప్రజా ప్రతినిధుల మాటల చెల్లుబాటు అయ్యేదన్నారు. ఆ రోజుల్లో ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధుల మాటలు అధికారులు వినేవారని కానీ.. ఇప్పుడు టీఆరెస్ పాలనలో స్థానిక ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందన్నారు. గ్రామాలకు ఖర్చు చేయాల్సిన నిధులు కూడా రావడం లేదని.. టీఆరెస్ స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా నిధులు లేక సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నారని తెలిపారు. లోకల్ లీడర్లు రోడ్లపై పడ్డారని.. వారెవరు సంతోషంగా లేరన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలమని చెప్పుకోలేకపోతున్నారని.. దిక్కులేక స్థానిక ప్రజా ప్రతినిధులు బ్రోకర్లుగా, పైరవీకారులుగా మారుతున్నారని తెలిపారు. 

కేసీఆర్ ఖబర్దార్ నీ సంగతి చూస్తా

ఎన్నో సంక్షేమ పథకాలను టీడీపీ, కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని.. టీఆర్ఎస్ జెండా మోసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సంతోషంగా ఉన్నారా.. గుండె మీద చేయి వేసుకొని చెప్పండన్నారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ, సీఐలకు పోస్టింగ్ ఇవ్వాలంటే.. లక్షల్లో వసూల్ చేస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మగౌరవంగా బతకాలంటే టీఆరెస్ పోవాలన్నారు. ఇజ్జత్ లేని బతుకు ఎన్నిరోజులు బతుకుతరని..కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం ఉంటుందన్నారు. కరెంట్ తీగలా కాదు.. హై టెన్షన్ వైరులా కొట్లాడుతమ్ అన్నారు. తెలంగాణ అమరులకు, రైతులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ను బొందపెట్టాలని.. తెలంగాణ తల్లి సోనియా గాంధే అన్నారు. ఖబర్దార్ కేసీఆర్.. నీ సంగతి చూస్తా..నాకు పీసీసీ పదవీ వస్తదని నిఘా వర్గాల రిపోర్ట్ రాగానే.. ప్రగతి భవన్ డోర్లు తీసుకున్నాయ్ అన్నారు. 

సీతక్కపై ప్రశంసలు

తెలంగాణ తల్లి బందీ నుండి విడదీయడానికి సోనియా గాంధీ నాకు పీసీసీ పదవీ ఇచ్చిందన్న రేవంత్.. తనకు ఎలాంటి పదవులపై ఆశ లేదన్నారు. సీతక్క నాకు అండగా ఉందని.. రాబోయే రోజుల్లో రాష్ట్ర నలుమూలల తిరగాల్సి ఉందన్నారు. సీతక్క క్యాడర్ నియోజకవర్గంలో గట్టిగా ఉండాలని..సీతక్క నాతో సరిసమానం అన్నారు. ఒకటే కుర్చీ ఉంటే.. ఆ కుర్చీలో సీతక్కనే కూర్చో బెడ్తా అన్నారు రేవంత్ రెడ్డి. మంగళవారం ఎమ్మెల్యే సీతక్క పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ములుగు నుంచి వంద వాహనాలతో హైదరాబాద్ కు వచ్చి రేవంత్ ను కలిసిన సీతక్క ములుగు  జిల్లా కార్యకర్తలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా సీతక్కను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి.