
- కవితను తీహార్ జైల్లో పెట్టించేందుకు మోదీతో కేసీఆర్ ఒప్పందం
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డ్రామాలాడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్
- కేసీఆర్ అవినీతి చేశారని చెప్తున్న బీజేపీ.. కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ తన బిడ్డ కవితను జైలుకు పంపించేందుకూ సిద్ధమయ్యారని ఆరోపించారు. కవితను తీహార్ జైలులో పెట్టించేలా ప్రధాని మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారన్నారు. తద్వారా ప్రజల్లో సానుభూతి పొంది వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ సర్కారుపై ఇప్పటివరకు ఈడీ, సీబీఐ కాదు కదా.. ఈగ కూడా వాలలేదన్నారు.
తెలంగాణలో భారీ అవినీతి జరుగుతుందంటూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా విమర్శిస్తున్నారే తప్ప.. ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
Also Raed :- తెలంగాణ సీఎంపై ఒక్క కేసూ పెట్టలే
ఆదివారం ఉదయం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్‌లతో కలిసి తాజ్‌కృష్ణలో మీడియాతో రేవంత్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని, అది సరిపోలేదని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు.
కాళేశ్వరం అక్రమ సొమ్ముతో లిక్కర్ స్కామ్‌లో పెట్టుబడులు పెట్టారని, ఆ స్కామ్‌లో బీజేపీకి వాటాలు ఉన్నాయని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో రూ.100 కోట్లు తిన్న ఆప్ మంత్రులను జైలుకు పంపితే.. మరి లక్ష కోట్లు తిన్న కేసీఆర్‌ను ఉరి తియ్యాలని రేవంత్ డిమాండ్ చేశారు. సోనియా, రాహుల్ గాంధీలను కేంద్రం ఎన్నో విధాలుగా అవమానించిందని, ఈడీతో వేధింపులకు దిగిందన్నారు.
కిషన్ రెడ్డి, కేసీఆర్ ఒక్కటే..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం కేసీఆర్ వేర్వేరు కాదని, ఇద్దరూ ఒక్కటేనని రేవంత్ విమర్శించారు. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి అనుచరుడని ఆరోపించారు. ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం దాడికి దిగుతున్నాయన్నారు. అందుకు ఆదివారం ఆ మూడు పార్టీలు పెట్టిన సభలు, కార్యక్రమాలే నిదర్శనమన్నారు. బీజేపీకి బీఆర్ఎస్, ఎంఐఎంలు బయటి నుంచే మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు.
2004లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, తుక్కుగూడ సభలో ఇచ్చే గ్యారంటీలను కూడా అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించడం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. ప్రాజెక్టు ఖర్చు కన్నా.. దాని కోసం చేసిన ప్రకటనల ఖర్చే ఎక్కువని రేవంత్ మండిపడ్డారు.