తెలంగాణ సీఎంపై ఒక్క కేసూ పెట్టలే

తెలంగాణ సీఎంపై ఒక్క కేసూ పెట్టలే
  • బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం.. పార్టీలు ఒక్కటే
  • ఒకదాని కోసం ఇంకోటి పని చేస్తున్నయ్: రాహుల్ గాంధీ
  • మోదీ సైగ చేస్తే చాలు కేసీఆర్​అండగా నిలబడుతున్నరు
  • బీజేపీతో మేమెక్కడ కొట్లాడినా అక్కడికి ఎంఐఎం వస్తున్నది
  • వంద రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొడ్తరని కామెంట్​

హైదరాబాద్, వెలుగు:బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని, ఒకదాని కోసం ఇంకొకటి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. ‘‘రాజకీయాల్లో మనం ఎవరితో కొట్లాడుతున్నామనే అవగాహన ఉండాలి. వారి శక్తియుక్తులు ఏమిటో కూడా మనకు తెలియాలి. తెలంగాణలోనే ఒక్క బీఆర్ఎస్‌‌‌‌తోనే కాంగ్రెస్​పార్టీ కొట్లాడటం లేదు.. బీజేపీ, ఎంఐఎంతోనూ పోరాడుతున్నది” అని చెప్పారు. తుక్కుగూడలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విజయభేరి సభలో రాహుల్ మాట్లాడారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మీకు వేర్వేరు పార్టీలుగా కనిపిస్తున్నా.. ఒకదాని అవసరాల కోసం ఇంకోటి పని చేస్తున్నాయి. పార్లమెంట్‌‌‌‌లో బీజేపీకి అవసరమున్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మోదీ సైగ చేయగానే బీజేపీకి అండగా నిలిచింది. జీఎస్టీ బిల్లు విషయంలోనూ అంతే. ఎప్పుడు బీజేపీకి ఏ అవసరం పడినా బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఈ రోజు మేము పబ్లిక్ మీటింగ్ పెట్టాలని అనుకుంటే.. మూడు పార్టీలు వేర్వేరు మీటింగ్స్‌‌‌‌ పెట్టాయి.. మన మీటింగ్‌‌‌‌ను డిస్ట్రర్బ్ చేయాలని చూశాయి. తెలంగాణ ప్రజలు ఇచ్చిన శక్తితో ఈ మీటింగ్‌‌‌‌ను ఎవరూ డిస్టర్బ్ చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీని ఎలా అడ్డుకోవాలా? అని ఆ శక్తులు ప్రయత్నిస్తునే ఉన్నాయి. మీరు ఓట్లు వేసి కాంగ్రెస్‌‌‌‌కు బలం ఇవ్వాలి” అని పిలుపునిచ్చారు.

తెలంగాణ సీఎంపై ఒక్క కేసూ పెట్టలే

దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయని.. కేసీఆర్, అసదుద్దీన్​ఒవైసీ తమకు స్నేహితులు కాబట్టే వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు పెట్టడం లేదని రాహుల్ ఆరోపించారు. ‘‘ప్రతిపక్షాల్లోని అన్ని పార్టీల లీడర్లపై సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు పెట్టాయి. వారిని వెంటాడుతున్నాయి. కానీ తెలంగాణ సీఎంకు వ్యతిరేకంగా ఒక్క కేసు పెట్టలేదు. ఎంఐఎం లీడర్లపైనా అంతే. కేసీఆర్, ఒవైసీ తన సొంత మనుషులని మోదీ అనుకుంటున్నారు కాబట్టే వారిపై ఎలాంటి కేసులు పెట్టడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా పట్టించుకోలేదు.

Also Raed :- కవితను కేసీఆరే జైలుకు పంపుతడు: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్‌‌‌‌ను మేం బీజేపీ రిస్తేదార్ సమితి అని చెప్తున్నాం” అని అన్నారు. సీఎం కుటుంబానికే అన్ని రకాల లాభాలు చేకూరుతున్నాయని, తాము తెలంగాణ ఇచ్చింది కేసీఆర్​ కుటుంబ లాభం కోసం కాదని చెప్పారు. తెలంగాణలోని పేదలు, రైతులు, కార్మికులు, మహిళల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ‘‘తొమ్మిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నది. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు లూటీ చేసింది. ధరణి పోర్టల్ పేరుతో భూములు, దళితులకు ఇచ్చిన భూములను లాక్కున్నారు.. రైతుబంధు పెద్ద రైతులకే లాభం చేసింది.. టీఎస్​పీఎస్సీ పరీక్షల పేపర్లు లీకయ్యాయి.. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు.. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను ఎన్నిరకాలుగా మోసం చేసిందో చెప్పడానికి ఇవి ఉదాహరణలు.. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని తిరిగి ఇస్తామని హామీ ఇస్తున్న” అని రాహుల్ ప్రకటించారు.

కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉంటయ్

దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారని ప్రధాని మోదీపై రాహుల్ మండిపడ్డారు. ‘‘ప్రతి ఇండస్ట్రీలోనూ అదానీకే లాభం జరుగుతున్నది. దీంతో ప్రపంచంలోనే కుబేరుడయ్యారు. నేను పార్లమెంట్ లో అదానీ గురించి మాట్లాడితే లోక్‌‌‌‌సభ సభ్యత్వం రద్దు చేశారు” అని ఆరోపించారు. రాష్ట్ర సంపద మొత్తాన్ని కేసీఆర్ తన కుటుంబానికి దోచి పెడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు మోదీకి ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టే ఇక్కడి అవినీతిపై తామేన్నో ఆధారాలు ఇచ్చినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అన్నింట్లో కేసీఆర్ మద్దతిస్తారనే మోదీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. తాము ఎక్కడ బీజేపీపై పోరాడినా, అక్కడ తమను ఎంఐఎం డిస్ట్రర్బ్ చేస్తున్నదని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలది పార్ట్‌‌‌‌నర్ షిప్ అనడానికి ఇదే ఉదాహరణ అన్నారు. 
కాంగ్రెస్ పార్టీ తలుపులు దేశ ప్రజలకు తెరిచే ఉంటాయన్నారు. దేశంలో బీజేపీ విద్వేషం రెచ్చగొట్టడం, హింసను ప్రేరేపించాలని చూస్తుంటే.. తాము ప్రజల మధ్య ప్రేమను పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ఆరు హామీలను అమలు చేస్తం 

తమ పార్టీకి నష్టం జరిగినా ముందుగా మాటిచ్చాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పుడు సోనియాగాంధీ ఇచ్చిన ఆరు హామీలను తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేస్తామని తెలిపారు. ‘‘కర్నాటకలో మేము ఐదు గ్యారంటీలను ఇస్తే.. అవి అమలు చేయలేమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటిని అమలు చేస్తున్నాం. ఇక్కడి ప్రజలెవరైనా కర్నాటకకు వెళ్లి అడిగితే హామీలను అమలు చేస్తున్న విషయం చెప్తారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక తమ జీవితాలే మారిపోయాయని అక్కడి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు” అని చెప్పారు. తెలంగాణలో గడిచిన తొమ్మిదేండ్లలో పేదలు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, మహిళలు, యువకులు ఎలాంటి లాభం చేకూరలేదని ఆరోపించారు. వంద రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టబోతున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని రక్షించాలని బీజేపీ, ఎంఐఎం అనుకున్నా.. ప్రజలు గద్దె దించి తీరుతారని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి చేశారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.500 లకే సిలిండర్​ఇస్తామని ప్రకటించారు. అన్నిరకాల పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీంను రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు హామీలను అమలు చేస్తామన్నారు. ‘జై హింద్.. జై తెలంగాణ’ అంటూ తన స్పీచ్‌‌‌‌ను ముగించారు.

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే

బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం వేర్వేరు పార్టీలుగా కనిపిస్తున్నా.. ఒకదాని అవసరాల కోసం ఇంకోటి పని చేస్తున్నయ్​. ఆ పార్టీలన్నీ ఒక్కటే.  పార్లమెంట్‌లో బీజేపీకి అవసరమున్నప్పుడల్లా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మోదీ సైగ చేయగానే బీజేపీకి అండగా నిలిచింది. జీఎస్టీ బిల్లు విషయంలోనూ అంతే. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నయ్. కానీ, కేసీఆర్,  ఒవైసీపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టడం ఖాయం.   - రాహుల్​గాంధీ, కాంగ్రెస్ ముఖ్యనేత