
- ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి సలహాలివ్వాలి
- అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటా.. లేకుంటే ఫామ్‌హౌస్‌లో ఉంటానంటే జనం శాశ్వతంగావిశ్రాంతి ఇస్తరు
- కేసీఆర్ చేసిన తప్పులు నేను చెయ్యను
- రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానిని ఎన్నిసార్లయినా కలుస్తానని ప్రకటన
- జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
- 5,612 నిమ్జ్ నిర్వాసిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ
- త్వరలో హుందాయ్ కార్ల తయారీ కంపెనీ పనులు మొదలవుతాయని వెల్లడి
సంగారెడ్డి, వెలుగు: సీఎం హోదాలో తాను ఏనాడూ అహం చూపడం లేదని, తన దగ్గరకు చిన్నోళ్లొచ్చినా..పెద్దోళ్లొచ్చినా మంచిగా పలకరించి అందరినీ
కలుపుకొని పోతుంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్నం.. ఓపికతో సమస్యలపై పోరాటం చేస్తే 92 లక్షల మంది ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చినం. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటా.. లేకుంటే ఫామ్‌హౌస్‌లో పడుకుంటానంటే ప్రజలు శాశ్వతంగా విశ్రాంతి ఇస్తరు. ప్రతిపక్ష నాయకుడు ఇది గమనించాలి. అసెంబ్లీకి వచ్చి తన 40 ఏండ్ల రాజకీయ అనుభవాలతో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇయ్యాలి. అభివృద్ధికి సహకరించాలి. ప్రజా సమస్యలపై మాట్లాడాలి” అని కేసీఆర్‌కు హితవుపలికారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు.
రూ. 494.67 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పస్తాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము చేయబోమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, కేంద్రం నుంచి నిధులు సాధించడం కోసం ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళ్తానని, ప్రధాని మోదీని ఒక్కసారేంటి ఎన్నిసార్లయినా కలుస్తానని చెప్పారు. తాము ఎన్నికల టైంలోనే రాజకీయాలు చేస్తామని, అధికారంలో ఉండి రాష్ట్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొనిపోతామని, ఇదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు.
నిమ్జ్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు
జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్జ్ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన 5,612 నిర్వాసితుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక ఎంపీ సురేశ్ షెట్కార్ ప్రతిపాదన మేరకు ఆయన ఇందిరమ్మ ఇండ్లను ప్రకటించి.. ఆ బాధ్యతను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అప్పగించారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వల్లూరి క్రాంతికి సభా వేదిక నుంచే సీఎం ఆదేశించారు. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిమ్జ్‌ను మంజూరు చేస్తూ ఫండ్స్ రిలీజ్ చేసిందన్నారు. కానీ, పదేండ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం నిమ్జ్ అభివృద్ధిని అడ్డుకోగా, అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే తమ కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణను స్పీడప్ చేసి నిమ్జ్ పరిహారాన్ని పెంచి నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నదని సీఎం వివరించారు. ఇక్కడ త్వరలో హుందాయ్ కార్ల తయారీ కంపెనీ పనులు మొదలవుతాయని తెలిపారు.
సింగూర్‌ను ఎకో టూరిజం చేస్తం
పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్‌ను ఎకో టూరిజం ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్‌కు తాగు నీటిని అందిస్తున్న సింగూర్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానన్నారు. నారాయణఖేడ్ -– లాతూర్, మెదక్–-బీదర్ దారులను కలుపుతూ నేషనల్ హైవేలుగా గుర్తించాలన్న మంత్రి దామోదర కోరిక మేరకు సీఎం రేవంత్ స్పందిస్తూ.. ఆయా దారులను జాతీయ రహదారులుగా గుర్తించేలా కేంద్రానికి ప్రతిపాదిస్తానని హామీ ఇచ్చారు.
ఐదేండ్లలో కోటి మంది ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తున్నామని.. ఐటీ, ఫార్మా, ఇండస్ట్రియల్ కారి డార్లను ఏర్పాటు చేసి వనరులు పెంచనున్నట్లు వివరించారు. కాగా, రూ.100 కోట్లతో నిర్మించిన 9.5 కి.మీ. ఫోర్‌లైన్ రోడ్డు, మాచునూర్‌లో రూ.26 కోట్లతో 11.8 ఎకరాల్లో నిర్మించిన కేంద్రీ య విద్యాలయ భవనం, రూ.100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, అదేవిధంగా మహిళల పెట్రోల్ బంక్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.