కేసీఆర్ ​రెస్ట్​ తీసుకునే టైమొచ్చింది : రేవంత్ రెడ్డి

కేసీఆర్ ​రెస్ట్​ తీసుకునే టైమొచ్చింది : రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ ​ఆరు గ్యారంటీలను చూసే ఆయనకు చలిజ్వరం
  • డిసెంబర్​ నెలలో అద్భుతం జరగబోతున్నది
  • బీజేపీ, బీఆర్ఎస్  కుట్ర చేస్తున్నాయని ఆరోపణ

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ ​రెస్ట్​ తీసుకునే సమయం వచ్చిందని, ఆయన ఇక ఫామ్​ హౌజ్​ నుంచి బయటకు రానక్కర్లేదని పీసీసీ చీఫ్ ​రేవంత్ ​రెడ్డి అన్నారు. తుక్కుగూడలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను చూసే గులాబీ బాస్​కు చలి జ్వరం వచ్చిందని విమర్శించారు. ఆ ఆరు గ్యారంటీలే 119 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులని ​స్పష్టం చేశారు. తెలంగాణను పట్టిపీడిస్తున్న కేసీఆర్ అనే రావణాసురుడి నుంచి విముక్తి కల్పించేలా ఈ విజయ దశమికి ప్రజలు కార్యోన్ముఖులై ముందుకు రావాలన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్నారు.“తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతుంది. రాబోయే విజయదశమిని తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవాలి” అని రేవంత్ వ్యాఖ్యానించారు. సంపద పెంచాలి- పేదలకు సమానం పంచాలనే నినాదంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందన్నారు. సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని, బస్సు యాత్రలో వాళ్ల పాత్ర ఉంటుందని రేవంత్ వెల్లడించారు.

వారిలో భయం మొదలైంది.. 

అధికారం కోల్పోతున్నామన్న భయం బిల్లా- రంగాల్లో మొదలైందని.. అందుకే స్థాయి లేకపోయినా సోనియా, రాహుల్ గాంధీలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. “వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. డిసెంబర్​లో అద్భుతం జరగబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది”అని రేవంత్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలపైనే తొలి సంతకం చేస్తామని స్పష్టం చేశారు. 

టికెట్లు అమ్ముకున్నారా? 

రేవంత్ ప్రెస్ మీట్​కి సొంత పార్టీ నేతనే అడ్డుతగిలారు. గద్వాల్ టికెట్ఆశిస్తున్న ఒక ఆశావహ నేత దగ్గరి బంధువు.. టికెట్లు అమ్ముకున్నారా? అంటు రేవంత్ ను ప్రశ్నించారు. సేవ్ కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదం చేశారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఇతర నేతలు సైలెంట్ గా ఉండమని వాదించినా, ఆ కార్యకర్త వినిపించుకోలేదు. మరోవైపు రేవంత్ మాత్రం స్పందించలేదు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే కుట్ర....

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని రేవంత్​ ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. 2018లోనూ బీజేపీ ఇలాంటి కుట్రలే చేసి, 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్​ఎఎస్​ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అని మోదీ, కేటీఆర్ లు అంగీకరించారన్నారు. తాము బీజేపీ, బీఆర్ఎ​స్​పై విమర్శలు చేస్తుంటే.. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు.