హంగ్ కాదు.. మేమే గెలుస్తం : రేవంత్ రెడ్డి

హంగ్ కాదు.. మేమే గెలుస్తం : రేవంత్ రెడ్డి
  • హంగ్ కాదు.. మేమే గెలుస్తం
  • డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణం
  • మేడిగడ్డ ఘటనతో కేసీఆర్ ను జైల్లో పెట్టే పరిస్థితి
  • అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా కేసీఆర్ పై పోటీకి సిద్ధం
  • కొడంగల్ లో పోటీకి రాకుంటే నేనే ఆయన వద్దకు వెళ్లి బరిలోకి దిగుతా
  • బీజేపీ, జనసేనతో పాటు కేఏ పాల్ ను కూడా కలుపుకుంటే బాగుండేది
  • నవంబర్ 2 లోపే రైతుబంధు, కల్యాణ లక్ష్మి పథకాలు అందించాలి
  • రిటైర్డ్ అధికారులతో నయా నిజాంలా ప్రైవేటు ఆర్మీ నడుపుతున్న సీఎం
  • మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ఢిల్లీ : రాష్ట్రంలో హంగ్ ప్రసక్తే లేదని, 40 ఏండ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ అలాంటి పరిస్థితి ఏర్పడలేదని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని, డిసెంబర్ 9న తమ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణం చేయబోతున్నారని వివరించారు.

బీజేపీ జనసేన పొత్తుపై స్పందించిన రేవంత్.. కేఏ పాల్ ను కూడా కలుపుకొంటే బాగుండేదంటూ సెటైర్ వేశారు. కేసీఆర్, కేటీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడించాలన్నది తమ సంకల్పమని, కేసీఆర్ కొడంగల్ లో పోటీకి రాని పక్షంలో తాను లేదా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెళ్లి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని చెప్పారు. మేడిగడ్డ పిల్లర్ కుంగడంపై కేసీఆర్ లాజిక్ మిస్సయ్యారన్నారు. పేలుడు పదార్థాలు పెడితే గాల్లోకి లేస్తాయి తప్ప కుంగిపోవన్నారు. మేడిగడ్డ డ్యాం కట్టిన ప్రదేశంలో బొగ్గు గనులు ఉండటం వల్లే కుంగిపోయిందన్నారు.

సయిల్ టెస్ట్ చేయకుండా కక్కుర్తి పడి డ్యాం కట్టారని, ఎల్ అండ్ టీ కంపెనీని కాపాడేందుకు ఆ నెపాన్ని సంఘవిద్రోహ శక్తుల మీదకు నెట్టతున్నారని రేవంత్ ఆరోపించారు. దీంతో కేసీఆర్ ను జైల్లో పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. బరాజ్ ను పరిశీలించిన కేంద్ర బృందం ఎందుకు నివేదికను బయట పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిని బట్టి కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అర్థమవుతోందన్నారు. ఈఎన్సీ మురళీధర్ రావు ఎవరో, ఆయనకు కేసీఆర్ తో ఉన్న బంధం ఏందో అందరికి తెలుసని రేవంత్ అన్నారు. 12 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన అధికారికి కీలక బాధ్యతలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తన కుల సంఘ నేతను కాపాడేందుకు మురళీధర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని ఆరోపించారు. క్రిమినల్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. 

మూడు అంశాలపై ఈసీకి ఫిర్యాదు

ప్రధానంగా మూడు అంశాలపై నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. రిటైర్డ్ అధికారులను వెంటనే తొలగించాలని కోరామని తెలిపారు. నయా నిజాం కేసీఆర్ దగ్గర సోమేవ్​ కుమార్, జయేశ్​ రంజన్, స్మితా సబర్వాల్ వంటి అధికారులు కీలక పదవుల్లో ఉండి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర బీఆర్ఎస్ కు విధేయంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లలు విడుదల చేసి సహకరిస్తున్నారని ఈసీకి వివరించినట్టు తెలిపారు. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్, ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని తెలిపామన్నారు. 

నవంబర్ 2 లోపు పథకాలివ్వండి : ఉత్తమ్

ఎన్నికల నోటిఫికేషన్ లోపే ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్టు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తాము రైతుబంధు ఆపినట్టు బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాము నవంబర్ 2వ తేదీ లోపు రైతుబంధు, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు అందించాలని కోరామని వివరించారు. అధికారి పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్న అధికారుల జాబితాను ఈసీకి అందించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

స్క్రీనింగ్ ముగిసింది : భట్టి

కాంగ్రెస్ అభ్యర్థుల స్క్రీనింగ్ ముగిసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సీఈసీ భేటీలో ఆమోదం తర్వాత లిస్ట్ విడుదల చేస్తామని ఆయన వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం ముగిసిన తర్వాత సెకండ్ లిస్టు ఇస్తామని తెలిపారు. తాము ఈసీని కోరింది ఒకటైతే బీఆర్ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం మరోటని వివరించారు.