
సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీష్ రావుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జప్తి శివనూర్‌లో ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ‘కేసీఆర్‌కు ఆనాడు యూత్ కాంగ్రెసులో స్థానం కల్పించి రాజకీయంగా అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ వల్లే హరీష్ రావు 2004లో మంత్రి అయ్యాడు. తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ.. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టేందుకు మామా అల్లుళ్ళు పోటీ పడుతున్నారు. దుబ్బాకకు వచ్చిన అభివృద్ధి పథకాలన్నీ సిద్దిపేటకు తరలించుకుపోయారు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవం కోసం జరిగిన ఉద్యమం. అలాంటిది దుబ్బాకపై సిద్దిపేట నాయకుల పెత్తనం ఏంటి? నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రైతులకు గిట్టుబాటు బాట ధరలు కూడా రాలేదు. దుబ్బాక ఎన్నికలలో టీఆర్ఎస్‌ను ఓడిస్తేనే కేసీఆర్‌కు కనువిప్పు కలుగుతుంది. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే టీఆర్ఎస్‌ను ఓడించాలి’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.