V6 News

కేసీఆర్ ముందు జీవన్ రెడ్డి చేతులు కట్టుకోవడం బాధాకరం : సీఎం రేవంత్

 కేసీఆర్ ముందు జీవన్ రెడ్డి చేతులు కట్టుకోవడం బాధాకరం : సీఎం రేవంత్
  • కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఆయన కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్​
  • ఇది జీవన్ రెడ్డి వయస్సుకు, 
  • అనుభవానికి ఏమాత్రం తగదు
  • ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఎన్నడూ మాట్లాడలే 
  • తనను కలిసిన జగిత్యాల నేతలతో సీఎం ఆవేదన 
  • త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాల వస్తానని సీఎం వెల్లడి

హైదరాబాద్, వెలుగు: జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం అత్యంత బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నలబై ఏండ్ల పాటు తనను గెలిపిస్తూ వచ్చిన జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. జీవన్​రెడ్డి వయస్సుకు, అనుభవానికి ఇది ఏమాత్రం తగదన్నారు. తాము ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఏనాడూ ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు.

మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ కార్యాలయంలో ఆయనను జగిత్యాల నియోజకవర్గానికి చెందిన సుమారు వంద మందికిపైగా పార్టీ ముఖ్య నేతలు కలిశారు. ‘‘మేం ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదు. ఆయన మర్యాదను తగ్గించలేదు. ఆయన గౌరవాన్ని తక్కువ చేయలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెట్టుకోవడం తప్పా? నేను చేస్తున్నది మంచో, చెడో మీరే ఆలోచించుకోవాలి. ఎవరు, ఏమిటి? అనేది కాలమే నిర్ణయిస్తుంది. అండగా నిలబడండి. మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తా. ధైర్యంగా ఉండండి. త్వరలోనే పార్టీ కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తా..’’ అని నేతలకు సీఎం భరోసా ఇచ్చారు.   

ఆయన గెలుపు కోసం అందరం కష్టపడ్డాం..  

2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో జీవన్​రెడ్డి గెలుపు కోసం అందరం కష్టపడ్డామని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన్ను కరీంనగర్ నుంచి పోటీ చేయమని సూచిస్తే.. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని కోరడంతో  అక్కడే పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు. దురదృష్టవశాత్తూ ఆయన ఓడిపోయారని సీఎం గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి చెప్పిన వారికే టికెట్లు ఇచ్చామని, భవిష్యత్తులో కూడా ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుపై భరోసా ఇచ్చామని, అయినా వినకుండా మొండిగా వ్యవహరించి పార్టీని వీడారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏండ్ల పాటు జీవన్ రెడ్డి గెలుపు కోసం పని చేసిన పార్టీ కార్యకర్తలను మోసం చేసి, దుర్మార్గుడైన కేసీఆర్ తో జీవన్ రెడ్డి జతకట్టడం ఏమీ బాగాలేదన్నారు.

వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరికి ధన్యావాదాలు.. మిమ్మల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నా.. అంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం.. త్వరలోనే జగిత్యాలకు వస్తా..’’ అని చెప్పారు. అంతకుముందు జగిత్యాల ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. జీవన్​రెడ్డి పార్టీని వీడినా తాము మాత్రం కాంగ్రెస్​లోనే కొనసాగుతామని, రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా శ్రమిస్తామని తెలిపారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.