- ఇయ్యాల మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రేవంత్ రెడ్డి బృందం చర్చలు
- 148 కాదు.. 152 మీటర్ల ఎత్తుతోనే
- ప్రాజెక్టు నిర్మించేలా ఒప్పించే యత్నం
- ఇదివరకే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రితో మీటింగ్
- సీఎం చొరవతో ఇరు రాష్ట్రాల అధికారులతో సీడబ్ల్యూసీ భేటీ
- .. మహారాష్ట్రకు ముంపును చూపే కాంటూరు మ్యాపులు
- ఎత్తు పెంచినా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోదని క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని సాకారం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి భగీరథ ప్రయత్నం మొదలైంది. మహారాష్ట్ర సర్కారుతో కీలక చర్చలు జరిపేందుకు ఆదివారం రాత్రి 8 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబై బయలుదేరి వెళ్లారు.
సోమవారం ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2016 ఆగస్టు 23న కుదుర్చుకున్న ఒప్పందంలో బ్యారేజీ నీటిమట్టాన్ని కేవలం +148 మీటర్లకే పరిమితం చేసి, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపైనే శ్రద్ధ పెట్టి తుమ్మిడిహెట్టిని పూర్తిగా పక్కన పడేసింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సాగు, తాగునీటి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా గరిష్ట నీటిని తరలించి, విద్యుత్ వ్యయాన్ని తగ్గించేలా +152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని సర్కారు పట్టుబడుతున్నది. 2025 డిసెంబర్ 4న ఆదిలాబాద్ ప్రజాపాలన విజయోత్సవాల్లో, అనంతరం 2026 జనవరి నిర్మల్ సభలో తుమ్మిడిహెట్టిని నిర్మించి తీరుతామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు.
మహారాష్ట్రతో అధికారిక చర్చలు
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కార్యాచరణను వేగవంతం చేసేందుకు ఏప్రిల్ 29న సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. దీంతో మే 6న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనంతరం మే 26న సీఎం రేవంత్మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖలు రాశారు. బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావంపై చర్చలకు సమయం కోరారు.
కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ జూన్ 11న ప్రధాని మోదీకి లేఖ రాయడంతో పీఎంవో దీనిని కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపింది. అనంతరం ఆగస్టు 5న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. సీడబ్ల్యూపీఆర్ఎస్ పుణె అధ్యయనం ప్రకారం +150 నుంచి +152 మీటర్ల ఎత్తుతోనే విద్యుత్ వ్యయం లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు అందుతాయని తెలిపారు.
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఇరు రాష్ట్రాల అధికారులు, మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో కేంద్ర జల సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల భేటీ జరిగింది. సెప్టెంబర్ 3న పుణె సంస్థ రూపొందించిన బ్యాక్‌వాటర్ అధ్యయన నివేదికతో పాటు 148 నుంచి 152 మీటర్ల వరకు ముంపు ప్రభావాన్ని చూపే కాంటూర్ మ్యాపులను రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర జలవనరుల శాఖకు సమర్పించింది. ఇందులో భాగంగా ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో నిర్వహించే భేటీలో బ్యారేజీ ఎత్తు పెంపు, అంతర్రాష్ట్ర అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి తుది
