న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎదురవుతున్న సంక్షోభాలపై యూఎన్ ప్రేక్షక పాత్రకే పరిమితం కాకుండా నాయకత్వం వహించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పిలుపునిచ్చారు. టెర్రరిజాన్ని విదేశాంగ విధానంలో ఒక ఆయుధంగా వాడుకోవడాన్ని అంగీకరించబోమని, ఎలాంటి కారణాలతోనూ దాన్ని సమర్థించలేమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన చిన్మయ మిషన్ 75వ వార్షికోత్సవంలో జైశంకర్ పాల్గొని మాట్లాడారు.
యునైటెడ్ నేషన్స్ విధానాల్లో తక్షణమే మార్పులు, సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. యూఎన్ తన లోపాలు, పరిమితులను గుర్తించి, పనితీరును మెరుగుపరుచుకోవాలని.. ప్రపంచంలోని పెద్ద భాగస్వామ్య దేశాలను నిర్ణయాధికారాల నుంచి దూరంగా పెట్టకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఎదుర్కొంటున్న సవాళ్లను, అవకాశాలను ఉమ్మడి భాగస్వామ్యంతోనే సమర్థవంతంగా పరిష్కరించుకోగలమని చెప్పారు.
