యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్.. కేసీఆర్ను పరామర్శించిన సీఎం

యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్.. కేసీఆర్ను పరామర్శించిన సీఎం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్ ను  రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటు డాక్టర్లను కూడా కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అంతకుముందు.. యశోద ఆస్పత్రిలో ఉన్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలతోనూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. 

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని డాక్టర్లు కూడా తమకు చెప్పారని అన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ ఆరోగ్యంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ, సహకరాలు అందిస్తామన్నారు. 

నిన్న (డిసెంబర్ 9న)  వైద్య, ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీని హాస్పిటల్ కు సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. 

హిప్ రీప్లేస్ మెంట్ ఆపరేషన్ తర్వాత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. శనివారం (డిసెంబర్ 9న) వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో కేసీఆర్ కాసేపు నడిచారు. హాస్పిటల్‌లోని తన రూమ్‌లో వాకర్‌‌తో కేసీఆర్ నడుస్తున్న 1.43 నిమిషాల నిడివి ఉన్న వీడియోను రిలీజ్ చేశారు. గురువారం (డిసెంబర్ 7న) రాత్రి ఎర్రవల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ జారిపడటంతో ఆయన్ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు కుటుంబ సభ్యులు తరలించారు.