రేవంత్.. మరో ఏక్​నాథ్ షిండే అవుతరు : కేటీఆర్

రేవంత్.. మరో ఏక్​నాథ్ షిండే అవుతరు : కేటీఆర్
  • ఎంపీ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం పక్కా 
  • మేడిగడ్డ విషయంలో రాజకీయాలు వద్దు
  • రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని నిలదీత

రాజన్నసిరిసిల్ల, వెలుగు: లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని, ఆయన మరో ఏక్​నాథ్ షిండే, హిమంత బిశ్వ  శర్మ అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల, ముస్తాబాద్​లో నిర్వహించిన పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘మోదీని బుట్టలో వేసుకోవడానికి ‘బడే భాయ్’ అని అంటున్నడు. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మోదీ ఆశీర్వాదం పొందేందుకు రేవంత్ ఇలాంటి కామెంట్లు చేశాడు.

 దీన్ని బట్టి కేంద్రంలో రాహుల్ ప్రభావం ఉండదని రేవంతే చెప్తున్నడు. మళ్లీ మోదీనే ప్రధాని అవుతారని ఒప్పుకున్నట్టే కదా? ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్​ను నిలదీస్తాం’’అని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి రాగానే  రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నదన్నారు. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉన్నాయని, వాటిలో ఒక్క పిల్లర్ కుంగితే కాళేశ్వరమే పనికి రాదన్నట్టు ప్రచారం చేస్తున్నదన్నారు. 

కుంగిన పిల్లర్లను రిపేరు చేస్తే సరిపోతుందన్నారు. సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వాలని, ఈ నెల 7న సిరిసిల్లకు వస్తున్న సీఎం.. ఈ మేరకు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల నేతన్నలపై కాంగ్రెస్ నేత మహేందర్​రెడ్డి కామెంట్లు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.