హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ కు ఏమాత్రం నిజాయతీ ఉన్నా..శనివారంలోపు ఆయన ఆస్తులను స్వచ్ఛందంగా ప్రకటించాలని విప్ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం అద్దంకి సీఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎందరో ఉద్యమ సమయంలో తమ ఇండ్లను, భూములను అమ్ముకుంటే, ఇంకొందరు కుదవపెట్టారని, కాని కేటీఆర్ ఆయన కుటుంబం మాత్రం అడ్డగోలుగా సంపాదించారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తిపాస్తులే ఎలా పెరిగాయని, వారికున్న ఆదాయ వనరులు ఏమిటో సమాజానికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంపాదించుకోలేదా అని కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతుండని, ఆయన 17 ఏండ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నారని, మీరు పదేండ్లు అధికారంలో ఉన్న విషయాన్ని మరిచిపోతున్నారని అన్నారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా 2023 ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పారు.
