ఇద్దరు టీచర్లతో 5 క్లాసులా?..జీవో 25ను రద్దు చేయాలె : ఎస్జీటీయూ డిమాండ్

ఇద్దరు టీచర్లతో 5 క్లాసులా?..జీవో 25ను రద్దు చేయాలె : ఎస్జీటీయూ డిమాండ్
  •     గాంధీ విగ్రహాలకు ఎస్జీటీయూ వినతులు

హైదరాబాద్, వెలుగు: సర్కారు ప్రైమరీ స్కూళ్ల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన జీవో నెంబర్ 25ను తక్షణమే రద్దు చేయాలని ఎస్జీటీయూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్ రెడ్డి, అరికెల వెంకటేశం మాట్లాడుతూ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ఆమరణ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు నేతలు తెలిపారు. 

20 నుంచి 60 మంది విద్యార్థులుండే బడుల్లో కేవలం ఇద్దరు టీచర్లతో 5 క్లాసులు, 18 సబ్జెక్టులు బోధించడం అశాస్త్రీయమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ, అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలను సర్కారుకు చేరవేయడం లేదని విమర్శించారు. తరగతి గదికో టీచర్ ను, ప్రైమరీ స్కూల్​కు హెచ్‌ఎంను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.