తెలంగాణ చిత్ర పరిశ్రమలో కీలక మార్పు చోటుచేసుకుంటోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న రెంటల్ సిస్టమ్ కు చరమగీతం పాడుతూ వాటా పద్ధతిలోకి మారాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు 23 ప్రీమియం థియేటర్ల యజమానులు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. థియేటర్ యజమానుల నిర్ణయం ఇప్పడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఏమిటీ నిర్ణయం? ఎందుకు?
ప్రస్తుతం మల్టీప్లెక్స్ ల హవా పెరగడం, నిర్వహణ ఖర్చులు భారమవ్వడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే దిశగా వెళ్తున్నాయి. ప్రైమ్ లొకేషన్లలో ఉంటూ, ప్రేక్షకులకు లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, అద్దె ప్రాతిపదికన నడపడం వల్ల థియేటర్లకు నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ఏప్రిల్ 3, 2026 నుండి కింది పర్సంటేజ్ పద్ధతిలో సినిమాలను ప్రదర్శించాలని నిర్ణయించారు. మొదటి వారంలో 60శాతం, రెండవ వారంలో 50 శాతం, మూడవ వారంలో 40 శాతం వాటా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది.
డిస్ట్రిబ్యూటర్ల మద్దతు
ఈ సమస్యపై ప్రముఖ పంపిణీదారులు శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్, బాబీ సానుకూలంగా స్పందించారు. కేవలం శశిధర్ రెడ్డి గారు మాత్రం దీనిపై నిర్మాతలతో చర్చించి తుది నిర్ణయం చెబుతానని తెలిపారు. ఈ మార్పు కేవలం 23 థియేటర్లకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్లకు దశలవారీగా వర్తింపజేయాలి ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.
జాతీయ స్థాయిలో మార్పు
గత మార్చి 11న బెంగళూరులో జరిగిన సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్ల సమావేశంలో కూడా ఈ విషయంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలు మినహా, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ ప్రాతిపదికనే నడుస్తున్నాయి. సినిమా థియేటర్లు కేవలం వ్యాపార కేంద్రాలు మాత్రమే కాదు, వేలాది కుటుంబాలకు జీవనోపాధి. అవి శాశ్వతంగా మూతపడకుండా ఉండాలంటే ఈ మార్పు అనివార్యమని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. నిర్మాతలకు, పంపిణీదారులకు ,ఎగ్జిబిటర్లకు మధ్య ఈ కొత్త ఒప్పందం ప్రతిపాదన ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Major decision by Telangana exhibitors
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) April 2, 2026
23 theatres have opted to shift from rental system to percentage-based screening from April 3, 2026.
New terms:
• Week 1 – 60%
• Week 2 – 50%
• Week 3 – 40%
This move aims to ensure survival of single screens and prevent closures,… pic.twitter.com/ZvZw66q3vy
