నా చావుతోనైనా RFCL బాధితులకు న్యాయం జరగాలె

నా చావుతోనైనా RFCL బాధితులకు న్యాయం జరగాలె

పెద్దపల్లి జిల్లా: RFCL ఉద్యోగ బాధితుడు ముంజ హరీశ్ (32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కమాన్ పూర్ మండలం గుండారం వద్ద హరీశ్ డెడ్ బాడీని పోలీసులు కనుగొన్నారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు హరీశ్ శుక్రవారం వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. RFCL ఉద్యోగం కోసం తన నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని,  కొత్త కాంట్రాక్టర్ రాగానే తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని ఆవేదనం వ్యక్తం చేశాడు. దళారులను నమ్మి మోసపోయాయని వాపోయాడు. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ చేశాడు. తన చావుతో నైనా బాధితులకు న్యాయం జరగాలని, బాధితులకు తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరాడు. తన చావును రాజకీయం చేయకుండా బాధితులకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఈ విషయంలో మీడియా సహకారం అందించాలని హరీశ్ కోరాడు. మృతుడు హరీశ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని హరీశ్ నుంచి  రూ.7 లక్షలు వసూలు చేసినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. 

హరీశ్ లాగ లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగం కోల్పోయిన వాళ్లు దాదాపు 400 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా నెలరోజులుగా డబ్బులైనా ఇవ్వండి లేదా ఉద్యోగాలైనా ఇవ్వండి అంటూ ఆందోళన చేస్తున్నారు. RFCL లో ఉద్యోగాలు పెట్టిస్తామంటూ బాధితుల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. RFCL బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.