ఆగస్టు నుండి కొత్త కార్డులకు బియ్యం

ఆగస్టు నుండి కొత్త కార్డులకు బియ్యం
  • పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన కొత్త రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్దమయింది. ఆగస్టు మాసం నుండే వారికి రేషన్ అందించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన విడుదల చేసారు. ఆగస్టు నెల నుండి కొత్త కార్డుదారులకు 10కిలోల ఉచిత బియ్యం పంపిణి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. నవంబర్ వరకూ 10కిలోల ఉచిత బియ్యం పంపిణి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 53.56 లక్షల రేషన్ కార్డులకు కేంద్రం ఇచ్చే 5కిలోలకు అదనంగా రాష్ట్రం 5కిలోల ఉచిత బియ్యం సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. మిగతా 37లక్షల రాష్ట్ర కార్డులకు పూర్తిగా 10కిలోలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన కొత్తకార్డులకు  23.10 కోట్లతో కలిపి ఏడునెలల కాలానికి అదనంగా  రూ.416.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందని ఆయన వివరించారు. 
ఆగస్టు 3 నుండి పంపిణీ ప్రారంభం
కొత్తకార్డులకు కేటాయింపులు, ఆదనపు బియ్యం సేకరణ నేపథ్యంలో ఆగస్టు 3 నుండి పంపిణీ ప్రారంభం అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా రాష్ట్రoలో అర్హులైన సుమారు 3,09,083 కొత్త కార్డుల్లోని, 8.65 లక్షల లబ్దిదారులకు ఆగష్టు నుండి ఒక్కొక్కరికి 10 కిలొల బియ్యం చొప్పున ఆగస్టు నుండి నవంబర్ నాలుగు నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నామన్నారు. దీని కోసం అదనంగా నెలకు రూ.23.10 కోట్లతో 4 నెలలకు రూ.92.40 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుoదన్నారు మంత్రి గంగుల. 
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎంజీకేఏవై (PMGKAY) పథకం క్రింద ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రాష్ట్రంలోని 53.56 లక్షల ఎన్ఎఫ్ఎస్ఏ (NFSA) కార్డుదారులకు, 33.85 లక్షల రాష్ట్ర కార్డుదారులకు గత మే, జూన్ రెండు నెలలుగా ఉచిత రేషన్ అందించిన విషయం తెలిసిందే. జూలైకు సంబందించిన పంపిణీ ఏర్పాట్లు ముగిసిన తర్వాత గత జూన్ 24న కేంద్రం నుండి ఉచిత రేషన్ పొడిగింపుపై అధికారిక సమాచారం అందింది. దీంతో జూలైలో ఇవ్వవలసిన 5కిలోల ఉచిత బియ్యాన్ని ఆగష్టు, 2021 కోటా 10 కిలోలకు కలిపి అదనంగా మొత్తం 15 కిలోలు పంపిణి చేయడం జరుగుతుందన్నారు. ఇందుకుగాను 87.41 లక్షల పాత కార్డుల్లోని దాదాపు 2.80 కోట్ల లబ్దిదారులకు 7 నెలల కోసం రూ.323.94 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు మంత్రి. 
దీంతో రాష్ట్రంలోని మొత్తం 90.50 లక్షల కార్డుల్లోని 2.88 కోట్ల లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణికి గాను రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.416.34 కోట్లు అదనంగా ఖర్చు చేయనుందన్నారు. క్రొత్త కార్డుల జారీ, అదనపు బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు తరలిoచవలసి వున్నందున ఆగష్టు నెల పంపిణి 3వ తేదీ నుండి ప్రారంబిస్తామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.