గ్లోబల్​ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం రేట్లు

గ్లోబల్​ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం రేట్లు

వెలుగు బిజినెస్​ డెస్క్​: గ్లోబల్​ మార్కెట్లో 11 ఏళ్ల గరిష్టానికి చేరిన బియ్యం రేట్లు మరింత పెరిగే ఛాన్స్​ ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. వరి పండించే ఆరు ప్రధాన దేశాలలోనూ ప్రొడక్షన్​ ఈసారి రికార్డు లెవెల్​కి చేరుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, గ్లోబల్​మార్కెట్లో రేట్లు తగ్గే అవకాశాలు లేవని అంటున్నారు. గ్లోబల్​మార్కెట్లో ఇండియాకు 40 శాతం వాటా ఉంది. అంతేకాదు, మన దేశం నుంచి ఎగుమతయ్యే బియ్యం రేటే తక్కువ కూడా. కానీ, ఈసారి మాత్రం ఎగుమతుల మార్కెట్లో మన బియ్యం  రేట్లు అయిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కొత్త సీజన్​ కోసం వరి రైతులకు చెల్లించే మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం కిందటి నెలలో 7 శాతం పెంచింది. గ్లోబల్​ మార్కెట్లో మన బియ్యం రేట్ల పెరుగుదలకు ఇది కూడా కారణమని చెబుతున్నారు.

300 కోట్ల మందికి  బియ్యమే కావాలి..

గ్లోబల్​గా చూస్తే 300 కోట్ల మందికి ప్రధానమైన ఆహారం బియ్యమే. ఆసియా దేశాలలో వరి సాగుకు నీరు చాలా ఎక్కువగా అవసరం. ఈ ఏడాది ఎల్​ నినో ఎఫెక్ట్​ ఉండొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఎల్​ నినో ఎఫెక్ట్​ బియ్యం ప్రొడక్షన్​పై పడే ఛాన్స్​ ఉంటుంది. మరోవైపు ఫుడ్​ అండ్​ ఎగ్రికల్చర్​ ఆర్గనైజేషన్ (ఎఫ్​ఏఓ) రైస్​ ప్రైస్​ ఇండెక్స్​ ఇప్పటికే 11 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఈ ఏడాది వరిసాగు చేసే ఆరు ప్రధాన దేశాలు బంగ్లాదేశ్​, చైనా, ఇండియా, ఇండోనేషియా, థాయ్​లాండ్​, వియత్నాంలలో రికార్డు లెవెల్​ ప్రొడక్షన్​ వస్తుందని యూఎస్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎగ్రికల్చర్​ (యూఎస్​డీఏ) ఎస్టిమేషన్స్​ రిలీజ్​ చేసింది. 

చక్కెర, మాంసం, గుడ్ల రేట్ల పెరుగుదల..

ఇటీవలి నెలల్లో చక్కెర, మాంసం, గుడ్ల రేట్లు గ్లోబల్​మార్కెట్లో భారీగా పెరిగాయి. చాలా మంది ప్రొడ్యూసర్లు ఎగుమతులను తగ్గించుకోవడమే దీనికి కారణం. ఆసియా దేశాలలో వరి దిగుబడి బంపర్​గా ఉంటుందని కొంత మంది నిపుణులు అంచనా వేస్తున్నా, ఎల్​నినో కారణంగా దిగుబడి తగ్గుతుందని గ్లోబల్​ ట్రేడింగ్​ కంపెనీలు చెబుతున్నారు. సప్లయ్​ తగ్గడంతో బియ్యం రేట్లు పెరగడం మొదలైందని ఓలమ్​ ఇండియా ప్రతినిధి గుప్తా పేర్కొన్నారు. ఈ టైములో ప్రొడక్షన్​ తగ్గితే,  రేట్లు మరింత పెరుగుతాయని చెప్పారు. 2023–24 చివరకు  గ్లోబల్​గా బియ్యం నిల్వలు ఆరేళ్ల కనిష్టానికి (170.20) మిలియన్​ టన్నులకు పడిపోతాయని భావిస్తున్నారు. డిమాండ్​ జోరందుకోవడంతో  ప్రధాన ప్రొడ్యూసర్లయిన చైనా, ఇండియాలలో నిల్వలు తగ్గిపోతున్నాయని యూఎస్​డీఏ చెబుతోంది. ఈ నేపథ్యంలో వరి దిగుబడి ఏ మాత్రం తగ్గినా, బియ్యం రేట్లు అయిదో వంతు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఆసియాలోని చాలా దేశాలలో రెండో పంటపై ఎల్​ నినో ఎఫెక్ట్​ ఉండొచ్చని న్యూఢిల్లీ గ్రెయిన్స్​ డీలర్​ ఒకరు పేర్కొన్నారు. మే నెలలో వర్షపాతం సాధారణం కంటే 26 శాతం తక్కువగా రికార్డవడంతో థాయ్​లాండ్​ తన దేశంలోని వరి రైతులకు ఒక పంట మాత్రమే వేయమని సలహా ఇచ్చింది. 

మన బియ్యమే చీప్​..

ప్రపంచంలోని అన్ని దేశాల కంటే తక్కువ రేటుకే మన బియ్యం ఎగుమతి అవుతున్నాయని రైస్​ ఎక్స్​పోర్టర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ బీ వీ కృష్ణారావు రాయిటర్స్​కు చెప్పారు. కనీస మద్దతు ధర పెంపుతో మన బియ్యం రేట్లు పెరిగాయని, దీంతో ఇతర దేశాలలోని సప్లయర్లు సైతం రేట్లను పెంచుతున్నారని పేర్కొన్నారు. ఎల్​నినో ఎఫెక్ట్​ ఏదో ఒక దేశానికి పరిమితమైనది కాదని, వరిసాగు చేసే అన్ని దేశాలపైనా ఉంటుందని ఓలమ్​ ఇండియా రైస్​ బిజినెస్​ వైస్​ ప్రెసిడెంట్​ నితిన్​ గుప్తా వెల్లడించారు.