DC vs KKR: మా ఆటతీరును చూసి సిగ్గేసింది.. కన్నీళ్ళొచ్చాయి: రికీ పాంటింగ్‌

DC vs KKR: మా ఆటతీరును చూసి సిగ్గేసింది.. కన్నీళ్ళొచ్చాయి: రికీ పాంటింగ్‌

బుధవారం(ఏప్రిల్ 3) కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 106 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌ బ్యాటర్లు ఉప్పెనలా ఎగిసిపడితే.. చేధనలో ఢిల్లీ బ్యాటర్లు నీటి బిందువుల్లా తేలిపోయారు. 273 పరుగుల భారీ ఛేదనలో రిషబ్‌ సేన 166 పరుగులకే ఆలౌటైంది. ఈ ఘోర పరాజయంపై ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఆటతీరు సరి కాదని తెలిపారు. 

పవర్‌ప్లేలోనే కేకేఆర్‌ బ్యాటర్లు దాదాపు 90 పరుగులు పొందారన్న పాంటింగ్.. ఆట ప్రారంభంలో అలా జరిగితే తిరిగి పుంజుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు. దీనికి తోడు పసలేని బౌలింగ్, 20 ఓవర్లు వేయడానికి 2 గంటల సమయం తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఒకానొక సమయంలో ఆటను చూడలేక కన్నీళ్ళొచ్చాయని భావోద్వేగంతో మాట్లాడారు.

మా ఆట చూశాక సిగ్గేసింది

"కోల్‌కతాపై తొలి అర్ధభాగం మా ఆటను చూశాక సిగ్గేసింది. బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చారు. కట్టడి చేయాలనే వ్యూహాలు ఎక్కడా కనిపించలేదు. దీనికి తోడు 20 ఓవర్లు వేయడానికి దాదాపు రెండు గంటల సమయం తీసుకున్నారు. ఫలితంగా రెండు ఓవర్లు వెనుకబడి.. సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లతోనే చివరి రెండు ఓవర్లు బౌలింగ్‌ చేశాం.. ఇలా ఒకటేమిటి చాలా పొరపాట్లను చేశాం. అవి ఆమోదయోగ్యం కానివి. తదుపరి మ్యాచ్‌ నాటికి వీటిని పరిష్కరించుకుని బరిలోకి దిగాలి. లేకపోతే టోర్నీలో మరింత వెనుకబడాల్సి రావొచ్చు.."

"కేకేఆర్ బ్యాటర్ల ఆట మొత్తం కనికరం లేకుండా సాగింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో వారు మరింత రెచ్చిపోయారు. పవర్‌ ప్లేలోనే 88 పరుగులు రాబట్టారు. ఆట ప్రారంభంలో అలా జరిగితే తిరిగి పుంజుకోవడం కష్టం. ఈ మ్యాచ్‌లో మాకు పోరాడే అవకాశమే లేకుండా పోయింది. అందుకు మనల్ని మనం విమర్శించుకోవాలి.." అని పాంటింగ్ వ్యాఖ్యానించారు.

అయితే, ఈ ఓటమి నిరాశ పరిచినా.. పంత్ బ్యాటింగ్ పట్ల తాను సంతోషిస్తున్నానని పాంటింగ్ తెలిపారు. బ్యాటింగ్ సమయంలోనూ, స్టంప్స్ వెనుక అతను ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించారు. కొన్నిసార్లు కాస్త తిమ్మిరి పట్టినట్లు అనిపించినా.. అదేమీ పెద్ద సమస్య కాబోదని అన్నారు.

ముంబైతో మ్యాచ్

ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.