
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి సమీపంలో ఉన్న రిధిరా జెన్ వద్ద 5-స్టార్ బ్రాండెడ్ రిసార్ట్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర యువజన అడ్వాన్స్‌మెంట్, టూరిజం, సాంస్కృతిక శాఖ (వైఏటీసీ) నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్ పొందామని రిధిర గ్రూప్ తెలిపింది. తెలంగాణ టూరిజం కాన్‌క్లేవ్ 2025లో ఈ ప్రకటన రాష్ట్ర వెల్‌నెస్ టూరిజం వృద్ధిలో ఒక మైలురాయి అని పేర్కొంది. సుమారు రూ.200 కోట్ల అంచనా పెట్టుబడితో 6 ఎకరాలలో దీనిని నిర్మిస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌లో 10 వేల చదరపు అడుగుల్లో గ్లోబల్ వెల్‌నెస్ సెంటర్ స్పా, విలాసవంతమైన విల్లాలు, ప్రీమియం ప్లాట్లు ఉంటాయి. ఈ 5-స్టార్ బ్రాండెడ్ రిసార్ట్ ఈ ప్రాంతంలోనే అతిపెద్ద వెల్‌నెస్- కేంద్రీకృత రిసార్ట్‌గా నిలుస్తుందని రిధిర గ్రూప్ ఫౌండర్ రితేష్ తెలిపారు. తెలంగాణలో వెల్‌నెస్ ఆతిథ్యాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ టూరిజం పాలసీ 2025–30కి అనుగుణంగా ఉందని ఆయన వివరించారు.