- ఒక్క కేసులోనూ ఎవరికీ శిక్ష పడలే: రాహుల్
- ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను నిర్వీర్యం చేశారు
- విద్యార్థులు టెర్రరిస్టులు కారు.. తమ హక్కులు, నిష్పాక్షిక విద్యా వ్యవస్థను కోరుతున్నారు
- వారిపై క్రూరంగా దాడి చేసిన పోలీసులను శిక్షించాలి
- ధర్మేంద్ర ప్రధాన్ అవినీతిపరుడు, అసమర్థుడు
- ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలి
- విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి
- నేను కొన్ని దెబ్బలు తింటే పోయేదేమీ లేదు
- మీడియా సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత కామెంట్స్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశ విద్యావ్యవస్థను నాశనం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గత పదేండ్లలో 152 పేపర్ లీకేజీలు జరిగాయని, ఏ ఒక్క కేసులోనూ ఏ ఒక్కరికీ శిక్ష కూడా పడలేదన్నారు.
బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాహుల్ మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలపై పోలీసుల దాడికి నిరసనగా భుజానికి నల్ల రిబ్బన్ కట్టుకుని రాహుల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు పూర్తి మద్దతు ప్రకటించారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవినీతిపరుడు, అసమర్థుడని మండిపడ్డారు. ఆయనను పదవి నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. చలో పార్లమెంట్ ర్యాలీలో విద్యార్థులపై క్రూరంగా దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై దాడి చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సహా విద్యార్థుల డిమాండ్లన్నీ పూర్తిగా న్యాయబద్ధమైనవని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు టెర్రరిస్టులు కారని.. సరిగ్గా, నిష్పాక్షికంగా పని చేసే విద్యా వ్యవస్థను మాత్రమే వారు కోరుతున్నారని అన్నారు.
దేశంలో జాబ్స్ లేవు.. పెను సంక్షోభం వస్తోంది..
దేశంలో ఉద్యోగాలు లేవని, మనం ఒక పెద్ద సంక్షోభం వైపు పయనిస్తున్నామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. పేపర్ లీకేజీల వివాదం వెనుక యువతను వేధిస్తున్న తీవ్రమైన ఉపాధి సంక్షోభం దాగి ఉందన్నారు. పేపర్ లీకేజీలు విద్యావ్యవస్థను దెబ్బతీశాయన్నది నిజమే అయినప్పటికీ, కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు లేకపోవడం అంతకంటే చాలా పెద్ద సవాలుగా మారిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రవేశంతో కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు, ప్రైవేటీకరణ కారణంగా ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. ‘‘దేశంలో ఉత్పాదక రంగం మూతపడింది.
వ్యాపార అవకాశాలు మూతపడ్డాయి. కార్పొరేట్ ఉద్యోగాలు మూతపడ్డాయి. ప్రభుత్వ రంగం మూతపడింది. వారికి ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రభుత్వ ఉద్యోగం. దాన్ని కూడా మీరు అవకతవకలతో నింపేసి, భరించలేని విధంగా మార్చేస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లతో మేం 100 శాతం ఏకీభవిస్తున్నాం. దీనికి సంబంధించి కఠినమైన చర్యలు ఉండాలి’’ అని ఆయన స్పష్టం చేశారు.
దేశ విద్యావ్యవస్థను కేంద్రం రిగ్గింగ్ చేసిందని, అది సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ‘సంసద్ చలో’ ఆందోళనలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌కు సంబంధించిన ఒక వీడియోను ప్రెస్‌మీట్ ప్రారంభంలో ప్రదర్శించారు. ‘‘మన విద్యార్థులకు ఎందుకు ఇలా జరుగుతుందనేదే అసలు ప్రశ్న. భద్రతా దళాలు వారివైపు ఆయుధాలు గురిపెట్టడానికి, వారిని కొట్టడానికి, తీవ్రంగా గాయపరచడానికి వారు ఏం చేశారు?’’ అని రాహుల్ ప్రశ్నించారు. ‘‘వారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు.
ఈ దేశం తమకు ఇవ్వాల్సిన హక్కులను కోరుతున్నారు. నిష్పాక్షికమైన విద్యావ్యవస్థ కావాలని అడుగుతున్నారు’’ అని అన్నారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారు పరిమితి లేని ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావ్యవస్థలలో ఒకటిగా పేరుగాంచిన మన విద్యావ్యవస్థ ఈరోజు లోపభూయిష్టంగా మారింది” అని అన్నారు.
నేను కొన్ని దెబ్బలు తింటే పోయేదేమీ లేదు..
ఢిల్లీలో ప్రధాని ఇంటి ముందు మంగళవారం జరిగిన ధర్నా సమయంలో పోలీసులు తనతో దౌర్జన్యంగా ప్రవర్తించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ స్పందిస్తూ.. కొన్ని దెబ్బలు తినేందుకు తాను భయపడనని చెప్పారు. ‘‘విద్యార్థుల గొంతుకగా మారడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. కొన్ని దెబ్బలు తగిలినా లేదా నన్ను ఎలా చూశారనే దాని గురించి నేను పట్టించుకోను. ప్రభుత్వం నాతో ఎలా ప్రవర్తించిందనేది ముఖ్యం కాదు. విద్యార్థుల డిమాండ్లు, వారి భవిష్యత్తు మాత్రమే నాకు అత్యంత ముఖ్యం’’ అని ఆయన స్పష్టం చేశారు.
‘‘విద్యార్థులకు క్షమాపణ చెప్పే సంస్కారం ప్రధాన మంత్రికి ఉండాలి. ఆయన కేవలం వ్యవస్థను నడుపుతున్నారు. నన్ను ఎలా చూశారనేది నాకు అనవసరం. నా పట్ల ప్రవర్తించిన దానికంటే ఐదు రెట్లు దారుణంగా ప్రవర్తించండి. కానీ విద్యార్థులకు న్యాయం చేయండి”అని అన్నారు. కాగా, మంగళవారం ఢిల్లీలోని ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేపట్టిన రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్‌ను ఛత్రసాల్ స్టేడియానికి తరలించిన పోలీసులు కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు. తనను విడుదల చేసిన తర్వాత రాత్రి పూట స్టేడియంలోనే రాహుల్ ఓ వీడియోలో మాట్లాడారు. విద్యార్థుల అంశంపై చర్చించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమైన తర్వాతే.. తాము ప్రధాని నివాసం ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
సగటున నెలకు ఓ పేపర్ లీక్..
గడిచిన దశాబ్దకాలంలో 152 పేపర్ లీకేజీలు జరిగాయని, దీంతో దేశ విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయి 7.5 కోట్ల మంది విద్యార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యారని రాహుల్ గాంధీ తెలిపారు. ‘‘ఒక ముఠా మన విద్యావ్యవస్థను, మన విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది” అని ఫైర్ అయ్యారు. ‘‘పదేండ్లలో 152 పేపర్ లీకేజీలు అంటే.. సగటున నెలకు ఒక లీక్ జరిగినట్లు లెక్క. ఈ లీకేజీల వల్ల కోట్లాది మంది విద్యార్థులు నష్టపోయారు. అయినా సరే, పేపర్ లీకేజీలకు సంబంధించి ఒక్క కేసులో కూడా ఎవరికీ శిక్ష పడలేదు” అని అన్నారు.
దేశ ప్రజలు తమ పిల్లలకు నీట్ కోచింగ్ కోసం ఏటా రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇది విద్యా బడ్జెట్ అయిన రూ.1.4 లక్షల కోట్లకు దాదాపు సమానమన్నారు. ‘‘ఇది ఆ కుటుంబాల నుంచి స్పష్టమైన దోపిడీ. వారి నుంచి దొంగిలించిన తర్వాత, మళ్లీ పేపర్ లీక్ అయిందని వారికే చెప్తారు’’ అని రాహుల్ విమర్శించారు. ‘‘ఈ వ్యవస్థ కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తోంది. ఇందులో పేదలకు ఏమాత్రం స్థానం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
