ముందస్తు ప్లాన్​తోనే అకోలాలో అల్లర్లు!

ముందస్తు ప్లాన్​తోనే అకోలాలో అల్లర్లు!
  • మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరీశ్ ​మహాజన్

అకోలా: మహారాష్ట్రలోని అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగి ఉండొచ్చని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ ​మహాజన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన మతపరమైన పోస్ట్‌‌ కారణంగా అకోలాలోని పాతబస్తీ ఏరియాలో శనివారం రాత్రి ఘర్షణ చెలరేగిన విషయం తెలిసిందే. రెండు గ్రూపుల సభ్యులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని విధ్వంసం సృష్టించడంతో ఒకరు చనిపోగా, ఇద్దరు పోలీసులు సహా మరో 8 మంది గాయపడ్డారు. మృతిచెందిన వ్యక్తిని విలాస్ గైక్వాడ్(40)గా పోలీసులు గుర్తించారు. కాగా, అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని ఆదివారం మంత్రి గిరీశ్​ మహాజన్ విజిట్​​చేశారు. అకోలాలోని రాజరాజేశ్వర దేవాలయం, హరిహర్ పేట సమీపంలోని ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అల్లర్లు ప్రిప్లాన్డ్​గానే జరిగి ఉండొచ్చన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరణించిన వ్యక్తి కుటుంబాన్ని కలిసి మంత్రి మహాజన్ సంతాపం తెలిపారు.