IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. మూడో టెస్టులో బ్యాటింగ్‎కు దిగిన రిషబ్ పంత్

IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. మూడో టెస్టులో బ్యాటింగ్‎కు దిగిన రిషబ్ పంత్

బ్రిటన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న మూడో టెస్ట్‎లో టీమిండియా కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డ విషయం తెలిసిందే. మూడో టెస్ట్ తొలి రోజు చేతి వేలికి బంతి బలంగా తాకడంతో పంత్ మైదానాన్ని వీడాడు. పంత్ స్థానంలో ధ్రువ్ జురైల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. దీంతో భారత అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పంత్ మూడో టెస్టులో బ్యాటింగ్‎కు దిగుతాడా లేదా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. పంత్‎కు గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. మూడో టెస్టులో బ్యాటింగ్‎కు దిగడం అనుమానమేనని కొన్ని సైట్లలో వార్తలు కూడా వచ్చాయి. 

ఈ తరుణంలో అనుమాలన్నింటినీ పటాపంచాలు చేస్తూ మూడో టెస్టులో పంత్ ఎట్టకేలకు బ్యాటింగ్‎కు దిగాడు. టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ 16 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‎లో ఔట్ కావడంతో పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్‎కు వచ్చాడు. పంత్ బ్యాటింగ్ కు రావడంతో.. టీమిండియా వికెట్ కీపర్ మూడో టెస్ట్ ఆడతాడా లేదా అన్న ఊహాగానాలకు తెరపడింది. ఫస్ట్ ఇన్సింగ్స్‎లో ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్ల కోల్పోయి 136 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ 50, పంత్ 16 ఉన్నారు. 

ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. రూట్ (106) సెంచరీ, బ్రైడన్ కార్సీ (56), స్మిత్ (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఫస్ట్ ఇన్సింగ్స్‎లో స్టోక్స్ సేన 387 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో చెలరేగగా.. నితీష్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీయగా.. జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం టీమిండియా ఫస్ట్ ఇన్సింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. సెకండ్ టెస్ట్ సెంచరీ హీరోలు జైశ్వాల్ (16), కెప్టెన్ శుభమన్ గిల్ (16) విఫలమయ్యారు. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ 40 పరుగులతో పర్వాలేదనిపించాడు.

ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 50, పంత్ 16 ఉన్నారు. ఆర్చర్, స్టోక్స్, వోక్స్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం భారత్ 245 పరుగులు వెనకబడి ఉంది. కాగా, ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ అతిథ్య ఇంగ్లాండ్ గెలిచిన విషయం తెలిసిందే. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్ 1–1 తేడాతో సమం అయ్యింది. లార్డ్స్ వేదికగా జరుగుతోన్న ఈ టెస్టు ఇరుజట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్‎లో అధిక్యంలోకి దూసుకెళ్లాలని ఇరుజట్లు ఉవ్విళ్లురుతున్నాయి.