IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్.. గ్రౌండ్ వదిలి వెళ్లిన టీమిండియా వికెట్ కీపర్

IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్.. గ్రౌండ్ వదిలి వెళ్లిన టీమిండియా వికెట్ కీపర్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చేతి వేలి గాయం కారణంగా గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. తొలి రోజు ఆటలో భాగంగా రెండో సెషన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుమ్రా వేసిన 34 ఓవర్ రెండో డెలివరీ పంత్ చేతి ఎడమ చేతి వేలికి బలంగా తగిలింది. నొప్పితో విలవిల్లాడడంతో ఫిజియో వచ్చి స్ప్రేను తన చేతి వేలికి చల్లాడు. నొప్పి తగ్గకపోవడంతో పంత్ గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయడానికి వచ్చాడు. 

ఇంగ్లాండ్ స్కోర్ 93 పరుగుల వద్ద పంత్ గ్రౌండ్ వీడి వెళ్ళాడు. ఈ మ్యాచ్ లో పంత్ తన కీపింగ్ తో ఆకట్టుకున్నాడు. రెండు అద్భుతమైన  క్యాచ్ లు పట్టడమే కాకుండా అసాధారమైన విన్యాసాలు చేశాడు. పంత్ మళ్ళీ గ్రౌండ్ లోకి ఎప్పుడు అడుగుపెడతాడో తెలియదు. అతని గాయంపై ఎలాంటి క్లారిటీ లేదు. రెండో రోజు ఉదయం పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ రెండో సెషన్ లో నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం 42 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (41), పోప్ (23) ఉన్నారు. 

అంతకముందు తొలి సెషన్ లో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకోవడంతో తొలి సెషన్ లో ఇంగ్లాండ్ 2 వికెట్లు నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ దశలో ఇంగ్లాండ్ ను రూట్, పోప్ ఆదుకున్నారు. మూడో వికెట్ కు అజేయంగా 76 పరుగులు జోడించి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు.