మెదక్, శివ్వంపేట, వెలుగు: జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో జరిగిన హత్యల్లో ఎక్కువ శాతం కుటుంబ సభ్యులే నిందితులుగా ఉన్నారు. వివాహేతర సంబంధాలు, అనుమానాలు, భూ వివాదాలు దారుణ హత్యలకు కారణాలవుతున్నాయి. మానవత్వం మరిచి కట్టుకున్న భార్యలను భర్తలు, భర్తలను భార్యలు, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న బిడ్డలను తండ్రులు, రక్తం పంచుకు పుట్టిన కొడుకులు కన్న తల్లులను, కలిసి మెలిసి ఉండాల్సిన సోదరులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలా అయినోళ్లే కుటుంబ సభ్యులను అంతం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
శివ్వంపేట మండల పరిధి తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బోయిన స్వామి (35)ని తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అతడి భార్య మౌనిక అదే గ్రామానికి చెందిన ప్రియుడు సంపత్ తో కలిసి హత్య చేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన చాకలి దశరథ్ (36) కొన్నేళ్ల కింద తన అన్న ఆశయ్య వద్ద 7గుంటల భూమిని కొన్నాడు. ఆ భూమిని తన పేరు మీదికి చేయాలని దశరథ్ కోరుతున్నప్పటికీ ఆశయ్య జాప్యం చేస్తూ అదనంగా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంలో పంచాయతీ జరిగి గ్రామ పెద్దలు నచ్చజెప్పినా ఆశయ్య భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇదే విషయంలో గత నెల 29న దశరథ్ ఆశయ్యకు ఫోన్ చేసి భూమి తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేయాలని అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో తమ్ముడిపై కోపం పెంచుకున్న ఆశయ్య కత్తితో గ్రామ చౌరస్తా వద్ద దశరథ్ ను పొడవడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు.
మెదక్ మండలం పెద్దబాయి తండాకు చెందిన భాస్కర్ తాగిన మైకంలో గత నెల 21న తన చిన్న కొడుకు లక్కీ (2) మెడకు తాడు బిగించి హత్య చేశాడు. భార్య అమీనాతో గొడవల నేపథ్యంలో ఆమె ఇద్దరు కొడుకులను వదిలి పుట్టింటికి వెళ్లిపోగా ఆమె భర్త భాస్కర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
శివ్వంపేట మండలం శభాష్ పల్లికి చెందిన వివాహిత బంటు మమత అదే గ్రామానికి చెందిన ఫయాజ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గతేడాది మే 21న ఆమె తన కూతురు తనుశ్రీ (2) ని తీసుకుని ఫయాజ్‌తో కలిసి ఏపీలోని గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటకు వెళ్లిపోయింది. వారిద్దరూ కలిసి గతేడాది జూన్ 7న తనుశ్రీ గొంతు నులిమి చంపి అక్కడి నుంచి బైక్ మీద శభాష్ పల్లికి తీసుకువచ్చి గ్రామ శివారులోని కాల్వ పక్కన పూడ్చి పెట్టారు. పోలీసుల విచారణలో ఈ దారుణం వెలుగుచూసింది.
కొల్చారం మండలం అంసాన్ పల్లిలో గతేడాది జులై 11న సొంత అన్ననే తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. వసురాం తండాకు చెందిన రమావత్ మంక్యా (45)ను అతడి సొంత తమ్ముడు మోహన్ బండ రాయితో మోది, కల్లు సీసాతో పొడిచి చంపాడు. అన్న దమ్ముల మధ్య ట్రాక్టర్ కిరాయి రూ.60 వేలకు సంబంధించి కొంత కాలంగా గొడవ జరుగుతోంది. మోహన్ మనవరాలు కొద్ది రోజుల కింద అనారోగ్యానికి గురై మృతి చెందింది. తన అన్నమంక్యా మంత్రాలు చేయడం వల్లే తన మనుమరాలు చనిపోయిందని మోహన్ అన్నపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో అంసాన్ పల్లి కల్లు డిపోలో అన్నదమ్ముల మధ్య ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయంలో మాటా మాటా పెరిగి గొడవ పెద్దదైంది. ఎప్పటి నుంచో కోపంతో ఉన్న తమ్ముడు మోహన్ అన్న మాంక్యా తలపై బండ రాయితో మోది, కల్లు సీసాతో పొడిచి చంపేశాడు.
పెద్ద శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామంలో గత జులై 3న మద్యానికి బానిసైన కొడుకును తండ్రే హత్య చేశాడు. గ్రామానికి చెందిన సుధాకర్ కు మద్యానికి బానిసై తల్లిదండ్రులతో తరచుగా గొడవపడేవాడు. ఈ క్రమంలో తనకు మూడు వేల రూపాయలు కావాలంటూ తండ్రితో గొడవ పడ్డాడు. పైసలు ఇవ్వకుంటే తెల్లారే వరకు చంపేస్తానంటూ తండ్రిని బెదిరించాడు. కొడుకుతో ఎప్పటికైనా తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల కొడుకుని చంపితే కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉంటుందని భావించిన తండ్రి నర్సింలు ఇంట్లో ఉన్న రోకలి బండతో తలపై గట్టిగా కొట్టడంతో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
శివ్వంపేట మండలం బిక్యా తండా పంచాయతీ నామ్య తండాకు చెందిన గోపాల్ వదిన లలితతో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత అన్న శంకర్ ను గతేడాది జనవరి 18న పథకం ప్రకారం కరెంట్‌షాక్ పెట్టి చంపేశాడు.
