న్యూఢిల్లీ: అస్సాం యంగ్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. 2026 సీజన్‌లో తమ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా పరాగ్ జట్టును ముందుండి నడిపిస్తాడని ఆర్‌ఆర్ ఫ్రాంచైజీ శుక్రవారం ప్రకటించింది. చాన్నాళ్లుగా జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేసిన రాయల్స్ అతని స్థానాన్ని పరాగ్‌తో భర్తీ చేసింది.
2019లో ఐపీఎల్‌లోకి వచ్చినప్పటి నుంచి రాజస్తాన్ ఫ్రాంచైజీతోనే ఉన్న 24 ఏండ్ల రియాన్.. గత సీజన్‌లో రాయల్స్ వైస్ కెప్టెన్‌గా, శాంసన్ గైర్హాజరీలో తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించిన అనుభవం అతనికి ఉంది. తనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీకి రియాన్ థ్యాంక్స్ చెప్పాడు. ‘ఐపీఎల్‌లోకి వచ్చిన తొలి రోజు నుంచే రాజస్తాన్ సొంతింటిలా మారింది. ఈ ఫ్రాంచైజీ నా వెన్నంటి నిలవడంతో పాటు ప్రతీ సీజన్‌లోనూ మెరుగయ్యేలా నన్ను తీర్చిదిద్దింది. అలాంటి జట్టుకు ఇప్పుడు నాయకత్వం వహించడం చాలా స్పెషల్. ఈ బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరించి నిర్భయమైన, తెలివైన క్రికెట్ ఆడి మా అభిమానులను గర్వపడేలా చేసేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రియాన్
పేర్కొన్నాడు.
