IPL 2026: దుమ్మురేపిన రియాన్ పరాగ్, ఫెరీరా.. ఢిల్లీపై RR భారీ స్కోర్

IPL 2026: దుమ్మురేపిన రియాన్ పరాగ్, ఫెరీరా.. ఢిల్లీపై RR భారీ స్కోర్

సొంతగడ్డపై బ్యాటింగ్‎లో రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది. రియాన్ పరాగ్ (90) కెప్టెన్ ఇన్నింగ్స్‎తో చెలరేగడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ధ్రువ్ జురెల్ (42), డొనొవన్ ఫెరీరా (47) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ 226 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగింది.

జైపూర్‎లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‎కు దిగిన రాజస్థాన్ రాయల్స్‏కు సరైన శుభారంభం దక్కలేదు. భీకర ఫామ్‎లో ఉన్న ఆర్ఆర్ యువ ఓపెనర్స్ యశస్వీ జైశ్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికే సిక్సర్ బాది ఊపుమీదున్న జైశ్వాల్‎ను మూడో బాల్‎కే ఔట్ చేసి స్టార్క్ ప్రతీకారం తీర్చుకున్నాడు. 

ఈ సీజన్లో సిక్సర్ల వర్షం కురిపిస్తోన్న వైభవ్ సూర్యవంశీని రెండో ఓవర్లలోనే జేమీసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో జతకట్టిన కెప్టెన్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్‎ను ముందుకు నడిపించారు. ఓ ఎండ్‎లో జురెల్ వికెట్ కాపాడుకుంటూ మెల్లగా ఆడగా.. కెప్టెన్ పరాగ్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో భారీ షాట్‎కు యత్నించి జురెల్ (42) ఔట్ కావడంతో మూడో వికెట్‎కు 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 

వేగంగా ఆడే క్రమంలో రియాన్ పరాగ్ 90 పరుగుల దగ్గర స్టార్ బౌలింగ్‎లో క్యాచ్ ఔటయ్యాడు. జడేజా (20) ఫర్వాలేదనిపించాడు. చివర్లో డొనొవన్ ఫెరీరా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాది 47 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతోన్న స్టార్క్ 3 వికెట్లు తీసి ఆరంభాన్ని ఘనంగా చాటుకున్నాడు. జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ తీశారు.