క్షీణిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

క్షీణిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

ఆర్జేడీ నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ పనితీరు ఎప్పుడైనా క్షీణించొచ్చని ఆయనకు చికిత్స చేసిన డాక్టర్ తెలిపారు. లాలూ ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఉన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆరోగ్యం గత కొన్ని వారాల నుంచి సరిగా ఉండటం లేదు.

‘లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ పనితీరు ఎప్పుడైనా క్షీణించొచ్చు. అది ఎప్పుడు అనేది ఊహించడం కష్టం. కానీ అది ఖచ్చితంగా జరగుతుంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అందుకే నేను ఈ విషయం గురించి అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపాను. తాజా పరిణామాలతో లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఇప్పటికే అనేక వ్యాధులతో ఆయన అనారోగ్యం బారినపడ్డారు. ఇప్పుడు కొత్తగా మూత్రపిండాల పనితీరు క్షీణిస్తుంది. లాలూ డయాబెటిస్, రక్తపోటు, మరియు గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయనను రాంచీలోని రిమ్స్‌కు తీసుకువచ్చినప్పుడు ఆయన కిడ్నీ 40 శాతం కంటే తక్కువగా పనిచేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని తాజా హెల్త్ బులెటిన్ సూచిస్తుంది. ఆయన మూత్రపిండాలు 4వ దశలో పనిచేస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడం కొత్త సమస్యలకు దారితీస్తుంది. అందుకే వెంటనే ఆయనకు డయాలసిస్ చేయడం అవసరం’ అని డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తెలిపారు.

డుమ్కా ట్రెజరీ నుంచి రూ. 3.13 కోట్లు ఎక్కువగా విత్ డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఆయన బెయిల్ పిటిషన్‌పై జరగాల్సిన విచారణ నవంబర్ 6, నవంబర్ 27 మరియు డిసెంబర్ 11న మూడుసార్లు వాయిదా పడింది. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడంకోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలతో ఒక కేసు నమోదైంది. జైలులో ఉండి జైలు నిబంధనలను ఉల్లంఘించినందుకు కూడా ఆయనపై బీహార్‌లో మరో కేసు నమోదైంది.