మరో బాలుడికి గాయాలు
గచ్చిబౌలి, వెలుగు: స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను ఆ తర్వాత చెట్టును ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందాడు. గచ్చిబౌలి పరిధిలోని గౌలిదొడ్డి కేశవ్‌నగర్‌కు చెందిన సాయికుమార్(15) తల్లిదండ్రులు చనిపోవడంతో తాత సాంబయ్య వద్ద ఉంటూ నల్లగండ్లలోని అక్షర ఫౌండేషన్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
సోమవారం సాయంత్రం సాయికుమార్ తన ఇంటి వద్ద పెయింటింగ్ వర్క్ చేస్తున్న వీరేందర్‌గౌడ్(17) అనే మరో బాలుడితో కలిసి స్కూటీపై జర్నలిస్ట్ కాలనీ నుంచి వస్తున్నాడు. ఈ క్రమంలో ఏవీఎన్ స్కూల్ వద్దకు రాగానే స్కూటీ అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను, ఆపై చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై సాయికుమార్ స్పాట్లోనే చనిపోగా, గాయపడిన వీరేందర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
