- మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
- తెలంగాణలో మావోయిజం అంతమైంది..
- గ్రేహౌండ్స్ విభాగాన్ని తొలగిస్తున్నాం..డీజీపీ సీవీ ఆనంద్
ఆదిలాబాద్/ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : ప్రజలు సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాల సాధ్యం అవుతుందని డీజీపీ సీవీ.ఆనంద్ చెప్పారు. బుధవారం ఆదిలాబాద్‌లో సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్‌ను ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రస్తుతం రోడ్డు ప్రమాద మరణాలు 50 శాతానికి పైగా తగ్గాయన్నారు.
జాతీయ రహదారులపై పార్కింగ్, అతి వేగంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇక నుంచి ప్రజలతో ఫ్రెండ్లీగా, నేరస్తుల పట్ల స్ట్రాంగ్‌గా ఉంటామన్నారు. తెలంగాణలో మావోయిజం అంతమైందని, గ్రేహౌండ్స్ విభాగాన్ని తొలగిస్తున్నామని చెప్పారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలోని ఒకరిద్దరు తప్ప మిగతా సీనియర్, జూనియర్ కేడర్ మొత్తం ఆయుధాలతో సరెండర్ అయ్యారని చెప్పారు. మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, ఆక్టోపస్ వంటి సంస్థల్లో 1,200ల మంది సిబ్బంది ఉన్నారని, ఇందులోంచి 500 మందిని డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, కల్తీ నియంత్రణ, హైవే ట్రాఫిక్ వంటి వాటికి బదిలీ చేయనున్నట్లు వివరించారు.
సైబర్ క్రైమ్స్‌పై అవగాహన, అప్రమత్తత ఉండాలన్నారు. డ్రగ్స్ నివారణకు ప్రత్యేక కార్యచరణ రూపొందించామని, ఇందుకోసం ఈగల్ సంస్థ పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సాగు చేస్తున్న 110 మంది రైతులను గుర్తించామని, వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.
కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ, సీఐడీ, ఏసీబీ డీజీ చారు సిన్హా, నార్కోటిక్స్ ఇన్‌చార్జి సందీప్ శాండిల్య, మల్టీ జోన్-1 ఐజీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ పి. మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్‌కు వచ్చిన డీజీపీ సీవీ.ఆనంద్‌ను ఎమ్మెల్యే పాయల్‌శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు.
మాజీ మావోయిస్టులకు భూ పట్టాలు అందజేత
గుడిహత్నూర్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోశం గ్రామంలో బుధవారం నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి డీజీపీ సీవీ.ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు భూ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... లొంగిపోయిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో గౌరవంగా బతకాలన్న ఉద్దేశంతోనే పునరావాస పథకం కింద భూమి అందజేస్తున్నట్లు చెప్పారు.
మతకలహాలు తగ్గినయ్
నిర్మల్, వెలుగు : పోలీసుల సమన్వయం, ప్రజల సామరస్య భావంతో మతకలహాలు పూర్తిగా తగ్గిపోయాయని డీజీపీ సీవీ.ఆనంద్ చెప్పారు. బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా పోలీస్ ఆఫీస్‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు
వెల్లడించారు.
