
- పంట పొలాలకు వెళ్లేందుకు రహదారుల నిర్మాణం
- సాగు పంటను తరలించేందుకు రైతుల తప్పనున్న ఇబ్బందులు
- జిల్లాలో 400 రోడ్ల కోసం నిధులు మంజూరు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో పొలాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద రోడ్లు, గుట్టలు, రాళ్లురప్పల మధ్య నడుచుకుంటూ వెళ్లలేకపోతున్నారు. పొలం బాట ద్వారా గ్రామాల నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధి హమీ పథకం నిధులతో రెండు నెలల నుంచి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పొలం బాటతో పంట పొలాలకు వెళ్లే మట్టి దారులకు మహర్దశ కలిగింది. కొన్ని గ్రామాల్లో పొలాలకు వెళ్లేందుకు దారులు సరిగా లేకపోవడంతోనే పంటలను సాగు చేయకుండా కౌలుకు ఇస్తున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులకు రహదారులు లేక ఇతర పొలాల్లో నుంచి వెళ్లే సందర్భాల్లో వివాదాలు జరుగుతున్నాయి. రైతులకు బాసటగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంట పొలాలకు దారులను తప్పనిసరిగా చేస్తూ పొలం బాటను తీసుకొచ్చింది.
రూ. 30 కోట్లు మంజూరు..
పొలం బాట ద్వారా పంట పొలాలకు మొరంతో మట్టి రోడ్లను అభివృద్ధి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా రూ. 30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు ఉపాధి హామీ పథకం కింద తీసుకోగా పనులు పూర్తైన తర్వాత పంచాయతీ రాజ్ శాఖ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రాధాన్య క్రమంలో గ్రామాలను ఎంపిక చేసి మొరం రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. 21 మండలాల్లో 400కు పైగా రహదారులు అవసరమని అధికారులు గుర్తించారు. దాదాపు 600 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 25 రహదారులు ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వర్షం పడని రోజు పనులు చేస్తున్నారు.
తీరనున్న రైతుల కష్టాలు..
వర్షాకాలం వచ్చిందంటే రైతులు పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. జిల్లాలో నల్లరేగడి సాగు భూములే అధికంగా ఉన్నాయి. ఈ పొలాలకు వెళ్లేందుకు రోడ్లు సైతం మట్టివి కావడంతో చిన్నపాటి వర్షానికే బురదగా మారతాయి. నకడదారితో పాటు ఎడ్ల బండ్లపై వెళ్లేందుకు ఇబ్బందులు తప్పవు. కొన్ని సార్లు ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లు, బైక్ లు బురదలో పడిపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అటు పంట పొలాలకు ఎరువులు, మందులు, మోటార్లు, పైప్ లు తీసుకెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పొలం బాట ద్వారా రోడ్లు అభివృద్ధి జరిగి రైతులకు కష్టాలు తీరనున్నాయి. ఒక్కో కిలోమీటర్ రహదారికి రూ. 10 లక్షల వరకు వెచ్చించనున్నారు.
పొలం బాటలు వేయడం సంతోషంగా ఉంది
ప్రభుత్వం పొలాలకు పొలం బాట కార్యక్రమంలో భాగంగా రహదారులు వేయించడం చాలా సంతోషం. వర్షాకాలంలో పంట పొలాలకు బురద లో ప్రమాదకరంగా వెళ్లాల్సి వచ్చేంది. ఇప్పుడు పొలాలకు దారులు వేయడంతో ఇబ్బందులు తప్పాయి.
కొట్టాల తిరుపతి రెడ్డి, రైతు, బోథ్
పనులు కొనసాగుతున్నాయి..
పొలం బాట ద్వారా జిల్లా వ్యాప్తంగా పంట పొలాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా రూ. 30 కోట్లు నిధులు మంజూరయ్యాయి. రైతులకు ఈ పనులతో ఎంతో మేలు జరుగనుంది. ఇప్పటికే 25 పనులు ప్రారంభించాం. త్వరలోనే మరికొన్ని పనులు చేపట్టి వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
రాథోడ్ శివరాం, పంచాయతీ రాజ్ ఈఈ,