- మహిళలకు 33% సీట్ల కేటాయింపు కూడా
- గతంలో 19 లక్షల జనాభాకు ఒక లోక్ సభ సీటు
- అదే రేషియో కంటిన్యూ చేసే దిశగా కేంద్రం
- ఈ క్రమంలోనే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు
- పలు రాష్ట్రాల ప్రతిపాదనలు పరిశీలిస్తున్న కేంద్రం
ఢిల్లీ: దేశ వ్యాప్త జనగణన లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమవుతోంది. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. నియోజకవర్గాల స్వభావం కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. గతంలో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నాలుగైదు జిల్లాలకు కూడా విస్తరించింది అదే విధంగా అసెంబ్లీ నియోజకర్గాలు కూడా రెండు మూడు జిల్లాలకు విస్తరించాయి.
జనాభా ఆధారంగా వాటిని ఎలా సెట్ చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపకల్పనను ప్రారంభించింది. జాతీయ స్థాయిలో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ, 17 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. పెరిగిన జనాభా ఆధారంగా రాష్ట్రంలో 153 సెగ్మెంట్లు అవుతాయి. ఎంత మంది జనాభా, ఎన్ని ఓట్లు అనేది పరిగణనలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. కేంద్ర దేశ వ్యాప్తంగా అమలు చేసే పద్ధతినే ఇక్కడా అమలు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం– 2014 ప్రకారం.. 34 సీట్లను పెంచి 153 సెగ్మెంట్లు చేయాలని పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వం సిద్ధం చేసే రోడ్ మ్యాప్ లో అంతకన్నా ఎక్కువ స్థానాలు వచ్చినా చేసే అవకాశం ఉంది. అయితే తగ్గించే చాన్స్ లేదని సమాచారం. దీని ప్రకారం 34 కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు రావడం పక్కాగానే కనిపిస్తోంది. 2027 జనాభా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే ఇక్కడ ఇంకో నిబంధన ఉంది. ఎన్ని లోక్ సభ స్థానాలు ఉన్నా.. అన్నింటిలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య సమానంగా ఉండాలి. అంటే ఒక్కో లోక్ సభకు 7 నుంచి 9 అసెంబ్లీ స్థానాలు ఉండొచ్చు.
దేశవ్యాప్తంగా డీ లిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల సంఖ్య 23కు పెరిగితే.. ఏడు చొప్పున వేసుకుంటే ఆ సంఖ్య 161కి చేరుకుంటుంది. అదే 25కు పెరిగితే.. అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య 175కు పెంచాల్సి ఉంటుంది. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో 8 నుంచి 9 అసెంబ్లీ స్థానాలను ఉంచాలని నిర్ణయిస్తే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంటుంది. దీంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న 153 అసెంబ్లీ స్థానాల సంఖ్యను మార్చాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా పునర్విజన చట్టంలో మార్పు చేయాల్సి ఉంటుంది.
మహిళలకు 33% రిజర్వేషన్లు
వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి మహిళలకు 33% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో 153 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయితే.. మహిళలకు 51 స్థానాలను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా అమలవుతాయి. గతంలో 2001 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగింది. అప్పడు భారత జనాభా.. 102.87 కోట్లు. అనధికారిక అంచనాల ప్రకారం.. దేశ జనాభా146 కోట్లుగా ఉంది.
2001 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. సుమారు 19 లక్షల జనాభాకు ఒక లోక్ సభ స్థానం ఉంది. ఇప్పుడు ఎంత మంది జనాభాకు ఒక లోక్ సభ సీటు ఉండబోతోందనేది ఈ రోడ్ మ్యాప్ లో డిసైడ్ చేయనున్నారు. గతంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు స్థానం ఉంది.. దానికి పెంచి 8, 9 అసెంబ్లీ స్థానాలకు చేస్తారా..? లేదా లోక్ సభ స్థానానికి జనాభాను తగ్గించి అదే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిమితిని కొనసాగిస్తారా..? అన్నది తేలాల్సి ఉంది.
దక్షిణాది ఆందోళనను పరిగణనలోకి తీసుకొనే..
రాష్ట్రాల్లో అసెంబ్లీల సీట్లు లోక్ సభ సీట్లు ఏ రకంగా ఉండాలనే దానిపై పలు ప్రతిపాదనలను కేంద్ర పరిశీలిస్తోంది. జనాభా నియంత్రణతో తమకు నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న రేషియోనే కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి.
జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత దాని ఆధారంగానూ పలు ప్రతిపాదనలు పరిశీలించాలని కేంద్రం భావిస్తోంది. రిజర్వేషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు నేషనల్ డీలిమిటేషన్ కమిషన్ సిద్ధమవుతోంది. 2027 లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
