జలదిగ్భంధం: కొట్టుకుపోయిన రోడ్లు..రాకపోకలు బంద్

జలదిగ్భంధం: కొట్టుకుపోయిన రోడ్లు..రాకపోకలు బంద్

రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.  హైదరాబాద్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్  ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు.... మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లోను తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షం పడుతుందని చెప్పారు అధికారులు. మూసీ పరివాహిక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా.... చాలా చోట్ల నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని, కరెంట్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతాయని, రవాణాకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపింది. దీంతో ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది వాతావరణశాఖ.


ఉమ్మడి వరంగల్ తో పాటు.. కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో చాలా గ్రామాలు, పట్టణాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా నడికుడలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాలలో 30 సెంటీమీటర్లు, హుజురాబాద్ మండలం బోమపల్లిలో 29 సెంటీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల 25, జమ్మికుంట మండలం కొత్తపల్లిలో 24 సెంటీమీటర్లు, వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 23 సెంటీమీటర్లు, సంగెంలో 22 సెంటీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లి ఘన్ పూర్ మండలం చెల్పూర్ లో 22, పరకాల 21 సెంటీమీటర్లు, ములుగు వెంకటాపూర్ లక్ష్మిదేవిపేటలో 20 సెంటీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి 20, కొత్తగూడెం పట్టణంలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

వరంగల్ నగరంలో ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తోంది. మధురినగర్, SR నగర్, గరీబ్ నగర్, బాలాజీ నగర్ కాలనీలు జలమయంలోనే ఉన్నాయి. చాలాచోట్ల ఇళ్ళలోకి నీరు వచ్చి చేరింది. ఇంట్లోని వస్తువులు, నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. మహబూబాబాద్ జిల్లా అర్పనపల్లి దగ్గర వాటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కేసముద్రం, గూడూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులోని…. వరంగల్, ఖమ్మం రహదారిపై వరద ఉధృతికి లారీ రోడ్డు పక్కకు ఒరిగింది. పంతిని దగ్గర జాతీయ రహదారిపై నుంచి నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. వరంగల్ లో కుండపోత వర్షాలు పడుతుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో రెడ్ అలర్ట్,  ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. స్థానిక ప్రజాప్రతి నిధులు, పోలీస్ ఉన్నతాధికారులను అప్రమత్తంగా ఉండాలని చెప్పారు కలెక్టర్లు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలను అప్రమత్తంచేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు. వాగులు, చెరువులు, కుంటల దగ్గరకు జనం వెళ్లకుండా చూడాలన్నారు. వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు.


కరీంనగర్ జిల్లాలో కుండపోత వాన పడుతోంది. రాత్రి నుంచి హుజురాబాద్, శంకరపట్నం,  సైదాపూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపిలేని వర్షాలతో చాలా గ్రామాల్లో చెరువులు అలుగుపోస్తున్నాయి. వీణవంక, జమ్మికుంట మండలంలోని మానేరు వాగు పరిసర గ్రామాల ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు పోలీసులు. లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో  ఉధృతంగా ప్రవహిస్తున్న మానేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశించారు అధికారులు. కమలాపూర్ మండల వ్యాప్తంగా భారీ వర్షంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కమలాపూర్ మండల కేంద్రంలోని 11వ వార్డు జలమయం. ఇల్లు, షాపుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. చొప్పదండి మండలం రాగంపేట్ శివారులోని పందివాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు కల్వర్టుపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆర్నకొండ నుంచి  రాగంపేట్, రేవెల్లి , పెద్దకుర్మపల్లి, గోపాలరావుపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలతో రోడ్లు తెగిపోతున్నాయి, ఇళ్లు మునిగిపోతున్నాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. సైదాపూర్, మహమ్మదపూర్ నుంచి వెళ్లే రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. సర్వే పేట నుంచి హుస్నాబాద్ కు వెళ్లే దారిలో రాకపోకలు బంద్ అయ్యాయి. జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో రాత్రి కుండిపోత వర్షం కురుస్తోంది. దీంతో జమ్మికుంట హౌస్ బోర్డు కాలనీ సగం వరకు నీట మునిగింది. రామడుగులో భారీ వర్షం కురిసింది. సరమ్మ చెరువు పూర్తిగా నిండి ఇళ్లలోకి వాన నీరు చేరింది. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. వర్షానికి కొన్ని ఇళ్లు కూలిపోయాయి. సరమ్మ చెరువు తెగిపోయే ప్రమాదం ఉండడంతో రక్షణ చర్యలు చేపట్టారు స్థానికులు. 

రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కరీంనగర్ నుంచి వేములవాడకు వచ్చే తిప్పపూర్ దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ మధ్యలో అయ్యప్పస్వామి టెంపుల్ దగ్గర వరద నీటి ప్రవాహంతో.. వేములవాడ.. మల్లారం మధ్య రాకపోకలు ఆగిపోయాయి. వేములవాడ- కోరుట్ల వెళ్లే దారిలో నాగయ్యపల్లి దగ్గర వరద నీటితో రాకపోకలు ఆగిపోకలు అంతరాం ఏర్పడుతోంది. హన్మాజిపేట దగ్గర నక్క వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. చాలా గ్రామాల దగ్గర వంతెనలపై నీరు వెళ్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్ల పట్టణానికి ఆనుకుని ఉన్న కొత్తచెరువు నిండి రోడ్డుపైకి నీళ్లు చేరడంతో సిరిసిల్ల-వేములవాడ మధ్య రాకపోకలకు బంద్ అయ్యాయి.సిరిసిల్ల కొత్త చెరువు దగ్గర వరద నీటిలో లారీ చిక్కుకుపోయింది. సిరిసిల్లలోని శాంతినగర్, సుభాష్ నగర్, సంజీవయ్య నగర్, అశోక్ నగర్, అనంతనగర్, బీవై నగర్, శివసాయి నగర్ కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి బయట పార్క్ చేసిన కార్లు, బైకులు వరద నీటిలో కొట్టుకుపోయాయి.  భారీ వరదలతో గంభీరావుపేట మండలం ధర్మాల దగ్గర అప్పర్ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకుతుంది. గంభీరావుపేట మండలం సింగసముద్రం ఐదు మత్తడుల చెరువు దగ్గర ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. లక్ష్మీదేవిపల్లి మండలం సంజీవ్ నగర్ లో మొర్రెడు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద నీటి కోతకు ఒక ఇల్లు చూస్తు ఉండగానే నేలమట్టం అయింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళందరూ బయటకి రావడంతో ప్రాణాపాయం తప్పింది.

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. 40 గేట్లు ఎత్తి.. 4లక్షల 30 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు.  4లక్షల 14వేల 846 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగుతోంది.  ఎల్లంపల్లి నుంచి వదులుతున్న నీరు భారీగా పార్వతీ బ్యారేజ్ కి చేరుకుంది. పార్వతీ బ్యారేజీ 65 గేట్లు ఎత్తారు అధికారులు. వచ్చిన నీళ్లు వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు.