భారీగా జాతీయ రహదారుల విస్తరణ

భారీగా జాతీయ రహదారుల విస్తరణ
  • రూ.28,615 కోట్లు..  715 కిలోమీటర్లు
  • ఈ ఏడాది భారీగా జాతీయ రహదారుల విస్తరణ
  • 10 ప్రాజెక్టుల్లో ఏడింటికి భూసేకరణ పూర్తి.. త్వరలోనే టెండర్లు
  • రెండు ప్రాజెక్టులకు ఇటీవల శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ వేగంగా జరుగుతోంది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు  నేషనల్​ హైవేస్​ విస్తరణ పెరిగింది. 2014 నాటికి రాష్ట్రంలో 2,511 కిలోమీటర్ల మేరకు నేషనల్​ హైవేలు ఉండగా, ఈ ఏడాది నాటికి  అవి 4,996 కిలోమీటర్లకు పెరిగాయి. ఈ ఏడాది 28,615 కోట్ల వ్యయంతో 715 కిలోమీటర్ల మేరకు 10 నేషనల్​ హైవేల విస్తరణ పనులకు నేషనల్​ హైవేస్ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) అధికారులు త్వరలోనే టెండర్లు ఖరారు చేయనున్నారు. 

రెండు ప్రాజెక్టులకే మెజారిటీ వ్యయం

ఈ ఏడాది విస్తరించనున్న జాతీయ రహదారుల్లో 2 ప్రాజెక్టులకే ఎక్కువ ఖర్చు చేయనున్నారు. వీటిలో 311 కిలోమీటర్ల నాగ్ పూర్–విజయవాడ 163జీ హైవేను 3ప్యాకేజీలుగా రూ.8,994 కోట్లతో విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రెండేండ్ల కిందే భూసేకరణ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్)లో సంగారెడ్డి-–నర్సాపూర్-–తుఫ్రాన్–-చౌటప్పల్ ఫేజ్ 1 కింద 158 కిలోమీటర్లను రూ.11,590 కోట్లతో విస్తరించనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు భూసేకరణకు కేంద్రం 2 గెజిట్​లను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న రైతులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధికారులు అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ ఏడాదిలోనే పనులు మొదలు

ఈ ఏడు ప్రాజెక్టుల్లో తొండపల్లి-–కొత్తూరు(12 కి.మీ.), కాలకల్లు–-గుండ్లపోచంపల్లి(17 కి.మీ.) ప్రాజెక్టులకు గత నెల 29న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంషాబాద్ లో శంకుస్థాపన చేశారు. కరీంనగర్–వరంగల్ హైవేస్ కు టెండర్లు ఇప్పటికే పిలిచారు. మరో 6 ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తయినట్లు నేషనల్ హైవేస్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో అభివృద్ధి చేయనున్న రహదారులను గ్రీన్ ఫీల్డ్, బ్రైన్ ఫీల్డ్ పద్ధతిలో నిర్మిస్తున్నామని, నాగపూర్–విజయవాడ సెక్షన్ లో మంచిర్యాల నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు ప్రాజెక్టుకు ఈ ఏడాదిలో టెండర్లు పిలుస్తామని ఎన్​హెచ్ఏఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ పది ప్రాజెక్టుల్లో 7 ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తయిందన్నారు.

ఈ ఏడాది టెండర్లు ఖరారు చేయనున్న ప్రాజెక్టులు ఇవే

1. కరీంనగర్    -    వరంగల్,68 కి.మీ., రూ. 2,146.86 కోట్లు‌‌‌‌‌‌‌‌(ఎన్ హెచ్ 563)
2. తొండుపల్లి    -    కొత్తూరు,12 కి.మీ., రూ.541.60 కోట్లు(ఎన్ హెచ్ 44)
3. కాలకల్లు    -    గుండ్లపోచంపల్లి, 17 కి.మీ. రూ.955.50 కోట్లు(ఎన్ హెచ్44)
4. జగిత్యాల    -    కరీంనగర్ 59 కి.మీ., రూ.1,900 కోట్లు(ఎన్ హెచ్ 563)
5. దేవసూగూరు    -    జడ్చర్ల ప్యాకేజ్ 1 కింద, 44 కి.మీ., రూ.1,375 కోట్లు, (ఎన్ హెచ్ 167)
6. మరికల్    -    జడ్జర్ల ప్యాకేజ్ 2 కింద 46 కి.మీ., రూ.1,112 కోట్లు(ఎన్ హెచ్ 167)
7. మంచిర్యాల    -    వరంగల్, 112 కి.మీ., రూ.2,795 కోట్లు, (ఎన్ హెచ్163జి)
8. వరంగల్    -    ఖమ్మం, 109 కి.మీ., రూ.3,088 కోట్లు(ఎన్ హెచ్ 163జి)
9. ఖమ్మం    -          ఏపీ బార్డర్, 90 కి.మీ., రూ.3,111 కోట్లు (ఎన్ హెచ్ 163జి)
10. సంగారెడ్డి    - తూప్రాన్–- చౌటుప్పల్(ఆర్ఆర్ఆర్), 158 కి.మీ., 
                           రూ.11,590    కోట్లు(ఎన్ హెచ్ 161ఏఏ)