దారి దోపిడీ ముఠా అరెస్ట్.. జీడిమెట్ల పోలీసుల అదుపులో నిందితులు

దారి దోపిడీ ముఠా అరెస్ట్.. జీడిమెట్ల పోలీసుల అదుపులో నిందితులు

జీడిమెట్ల, వెలుగు: గంజాయి, మద్యం మత్తులో ఒంటరి ప్రయాణికులే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం వెల్లడించారు. 

బేగంపేటకు చెందిన బి.సాయికిరణ్, సీహెచ్ నవీన్, గుగులోత్ అనిల్​తోపాటు సాయితేజ, పండు, ఈశ్వర్‌‌ గంజాయి, మద్యానికి బానిసయ్యారు. వీరంతా ప్రతిరోజూ బేగంపేట్, ప్రకాశ్​నగర్ పరిసర ప్రాంతాల్లోని వైన్ షాపుల వద్ద కలుసుకునేవారు. ఈ క్రమంలో వీరి మధ్య స్నేహం పెరిగి, జల్సాల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వారిపై దాడులు చేసి దోచుకోవడం ప్రారంభించారు. ఈ నెల 14న రాత్రి హెచ్‌‌ఎంటీ ఖాళీ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్న రాకేశ్ శర్మ, అతని మిత్రుడు హరీశ్ రెడ్డిని అడ్డగించి తీవ్రంగా కొట్టారు. 

అనంతరం వారి వద్ద నుంచి 7.5 గ్రాముల బంగారు గొలుసు, వన్​ప్లస్ ఫోన్​ను లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా సాయికిరణ్, నవీన్, అనిల్​ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సాయితేజ, పండు, ఈశ్వర్​కోసం గాలిస్తున్నారు.