మలబార్​ గోల్డ్​ షాపులో చోరీ.. మహిళ అరెస్ట్

మలబార్​ గోల్డ్​ షాపులో చోరీ.. మహిళ అరెస్ట్
  • రూ.2 లక్షల 8 వేల విలువైన బంగారు గొలుసు స్వాధీనం

ఓయూ, వెలుగు: జువెల్లరీ షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్ పారుపల్లి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వేమూరి భార్గవి రెడ్డి(26) స్థానికంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ నడిపేది. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. వాటి నుంచి బయటపడేందుకు ఆమె జువెల్లరీ షాపుల్లో చోరీలకు స్కెచ్ వేసింది. గత నెల 24న తిరుపతి నుంచి హైదరాబాద్ కు వచ్చిన భార్గవి రెడ్డి.. హబ్సిగూడలోని మలబార్ గోల్డ్ షాప్​కు వెళ్లింది. నగలు చూపించాలని సేల్స్​ మన్ ను అడిగింది. ఈ క్రమంలో 39.962 గ్రాముల బంగారు గొలుసును తన మెడలో వేసుకుంది.

మరో డిజైన్ ను చూపించాలని సేల్స్ మన్ కు చెప్పింది. అతడు వెనక్కి తిరిగి గోల్డ్ చైన్లు ఉన్న ట్రేను టేబుల్ పై పెట్టేలోగా భార్గవి ఆమె మెడలోని గొలుసుకు బ్యాగ్ లో వేసుకుని.. నకిలీ చైన్ ను ట్రేలో ఉంచింది. ఆ  తర్వాత డిజైన్ నచ్చలేదంటూ షాప్ బయటికి వచ్చింది. అక్కడి నుంచి పంజాగుట్టలోని అట్టికా గోల్డ్ కంపెనీ దగ్గరకు వెళ్లింది. కొట్టేసిన బంగారాన్ని అక్కడ అమ్మేసింది. అట్టికా గోల్డ్ షాప్ సేల్స్ మేనేజర్ ఆ బంగారాన్ని తీసుకుని  భార్గవి అకౌంట్ లోకి రూ.2 లక్షల 8 వేల 500 ట్రాన్స్ ఫర్ చేశాడు.  తర్వాత భార్గవి ఆ అమౌంట్ ను తన ఫ్రెండ్ అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసింది.

అయితే, నకిలీ గోల్డ్ చైన్ ను గుర్తించి మలబార్ గోల్డ్ షాప్ నిర్వాహకులు ఓయూ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. భార్గవి చోరీ చేసినట్లు గుర్తించారు. ఆ ఫుటేజీ సాయంతో ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలుసుకున్నారు. పంజాగుట్టలో భార్గవిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె అమ్మిన 39.962 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అట్టికా గోల్డ్ కంపెనీ మేనేజర్, సేల్స్ మన్ పరారీలో ఉన్నట్లు ఇన్​స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు.