
హరారే: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్.. సౌతాఫ్రికా, జింబాబ్వేతో జరుగుతున్న టీ20 ట్రై సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. టిమ్ రాబిన్సన్ (57 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 75), బెవాన్ జాకబ్స్ (30 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 44 నాటౌట్) మెరుపులకు తోడు బౌలర్లు కూడా రాణించడంతో బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 21 రన్స్ తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత20 ఓవర్లలో 173/5 స్కోరు చేసింది. రాబిన్సన్, జాకబ్స్‌తో పాటు ఓపెనర్ టిమ్ సిఫర్ట్ (22) ఫర్వాలేదనిపించాడు.
సఫారీ బౌలర్లలో క్వెనా మఫాక రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 152 రన్స్‌కే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్ (18 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 35), జార్జ్ లిండే (30), లువాన్ ప్రిటోరియస్ (27) పోరాడినా ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ (3/20), మాట్ హెన్రీ (3/34) చెరో మూడు, ఇష్ సోధీ (2/34) రెండు వికెట్లు పడగొట్టారు. రాబిన్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వేతో న్యూజిలాండ్ తలపడనుంది.