ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై రాకెట్ల దాడి

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై రాకెట్ల దాడి

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్, ఇరాక్‌ల మధ్య వైరం ఇంకా ముదురుతుంది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా బుధవారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై మరో రెండు రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరూ చనిపోలేదు. అమెరికా రాయభార కార్యాలయంతో పాటు వేరే దేశాల రాయభార కార్యాలయాలున్న హై-సెక్యూరిటీ జోన్‌లో బుధవారం రాత్రి రెండు రాకెట్లు కూలిపోయాయి. వెంటనే గ్రీన్ జోన్ భద్రతా సిబ్బంది అలర్ట్ సైరన్‌ మోగించింది. ఇరాన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాక్ మిసైల్ దాడి చేసిన 24 గంటలలోపే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఇరాక్ అధికారులు తెలిపారు.

గత వారం ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ ఖాసేం సోలేమాని మరియు ఇరాకీ కమాండర్ అబూ మహదీ అల్-ముహండిస్‌లను అమెరికా డ్రోన్‌ల సహాయంతో చంపింది. ఆ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగాయి. ముహండిస్ ఇరాక్‌లోని హషెడ్ అల్-షాబీకి డిప్యూటీ హెడ్‌గా ఉన్నారు. అంతేకాకుండా.. టెహ్రాన్‌తో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. గత నెలలో బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్ దాడులు జరిగాయి. ఆ దాడుల వెనుక హషెడ్ గ్రూపులు ఉన్నాయని అమెరికా ఆరోపించింది.

పారామిలిటరీ చీఫ్ ఖైస్ అల్-ఖజాలి అమెరికా సైనికులను ఉగ్రవాదులుగా పేర్కొన్నారు. అమెరికా చేస్తున్న దాడులకు ఇరాక్ ప్రతిస్పందన ఇరాన్ ప్రతిస్పందన కంటే ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.

సులేమానిని చంపడమే కాకుండా.. తమపై దాడులు చేస్తున్న అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హాషెడ్ వర్గాలు ప్రతిజ్ఞ చేశాయి. ‘అమెరికన్ సైనికులారా కళ్ళు మూసుకోకండి. అమరవీరుడు ముహండిస్‌ను చంపినందుకు ఇరాక్ మీపై ప్రతీకారం తీర్చుకుంటుంది. మీ చివరి సైనికుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళే వరకు మా దాడులు ఉంటాయి’ అని హరాకత్ అల్-నుజాబా అనే హాషెడ్ వర్గం తెలిపింది.