గవర్నమెంట్​ స్కూళ్లే బెస్ట్ .. ‘వెలుగు’తో ఖమ్మం డీఈవో సామినేని సత్యనారాయణ

గవర్నమెంట్​ స్కూళ్లే బెస్ట్ .. ‘వెలుగు’తో ఖమ్మం డీఈవో సామినేని సత్యనారాయణ
  • మెరుగైన సౌకర్యాలు, అర్హత కలిగిన టీచర్లున్నారు
  • ‘బడిబాట’తో పాఠశాలల బలోపేతంపై దృష్టి పెట్టాం
  • అన్ని స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్​ తరగతులు నిర్వహిస్తాం
  • 50కి పైగా స్టూడెంట్స్​ ఉన్న ప్రతీ స్కూల్​లో ఏఐ క్లాసులు

ఖమ్మం, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలతో పాటు అర్హత, అనుభవం కలిగిన టీచర్లున్నారని, విద్యార్థులు చదువుకునేందుకు గవర్నమెంట్ స్కూళ్లే బెస్ట్ అని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సామినేని సత్యనారాయణ అన్నారు. 

ఈనెల 12 నుంచి స్కూళ్ల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. జిల్లాలో జీరో ఎన్​ రోల్ మెంట్ స్కూళ్లు 60 ఉన్నాయని, వాటిలో కొత్తగా విద్యార్థులు చేరేలా ‘బడిబాట’లో దృష్టిపెట్టామన్నారు. ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న గ్రామాల నుంచి విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్లేలా ఇంటింటికెళ్లి వివరిస్తున్నామన్నారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. 

బడి బాట నిర్వహిస్తున్నాం

బడిఈడు పిల్లలు బడిలోనే ఉండేలా ‘బడి బాట’ నిర్వహిస్తున్నాం. అంగన్​ వాడీలు, టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు, అమ్మ ఆదర్శ కమిటీలు అందరూ కలిసి ఆయా గ్రామాల్లో పిల్లలు, డ్రాపవుట్స్ ను గుర్తిస్తున్నాం. వాళ్లందరి ఇండ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా పేరెంట్స్ తో మాట్లాడుతున్నాం. అంగన్​ వాడీల్లో ఐదేళ్లు దాటిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరేలా చూస్తున్నాం. స్కూళ్లలోని సౌకర్యాల గురించి చెబుతూ, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫాం ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. 

ఈ విద్యా సంవత్సరం కోసం ఇప్పటికే 90 శాతానికి పైగా పుస్తకాలు చేరుకున్నాయి. స్కూళ్లు స్టార్టయ్యే వరకు 100 శాతం అన్ని బుక్స్ చేరుకుంటాయి. ఒక జత యూనిఫాం కుట్టడం కూడా పూర్తయి అన్ని స్కూళ్లకు చేరుకున్నాయి. రెండో జత యూనిఫాం క్లాత్ వచ్చింది. త్వరలోనే కుట్టించి అందజేస్తాం.  

ఆ  స్కూళ్లలో ఏఐ, స్పోకెన్​ ఇంగ్లీష్ క్లాసులు

ఖమ్మం జిల్లాలో ఎంపిక చేసిన ఏడు స్కూళ్లలో గతేడాది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్​ (ఏఐ) క్లాసులు ప్రారంభించాం. ఈ ఏడాది 50 మందికి పైగా స్టూడెంట్స్​ ఉన్న ప్రతీ ప్రభుత్వ స్కూళ్లలోనూ ఏఐ బోధన ఉండేలా చూడాలని కలెక్టర్​ ముజమ్మిల్ ఖాన్​ ఆదేశించారు. ఇందుకోసం త్వరలోనే ప్రతీ స్కూలుకు 5 కంప్యూటర్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే చాలా స్కూళ్లలో ఇంటరాక్టివ్​ ప్యానెల్ బోర్డుల ద్వారా క్లాసులు చెబుతున్నాం. 

వీటితో పాటు విద్యార్థులకు స్పోకెన్​ ఇంగ్లీష్​ నేర్పించేందుకు గాను నిర్వహిస్తున్న ‘వీ కెన్​ లెర్న్’ కార్యక్రమం 35 స్కూళ్లలో గతేడాది ఉండగా, ఈసారి అన్ని స్కూళ్లలో అమలు చేయబోతున్నాం. ఈ అంశాలన్నింటిని బడి బాట ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. 

12 నుంచే స్కూళ్లు ప్రారంభించాలి

వేసవి సెలవుల తర్వాత ఈనెల 12 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ స్కూళ్లు కూడా ప్రభుత్వం నిర్ణయించిన తేదీల ప్రకారమే తరగతులు స్టార్ట్ చేయాలి. స్కూల్​ ప్రమోషనల్ యాక్టివిటీస్​ చేసుకోవచ్చు తప్పించి, విద్యార్థులకు ముందుగానే తరగతులు ప్రారంభిస్తే అలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం. ఈనెల 9 నుంచి కొన్ని స్కూళ్లలో తరగతులు ప్రారంభిస్తున్నట్టుగా పేరెంట్స్​ కు ఫోన్​ చేయడం, మెసేజ్​ లు పంపిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చింది.  అలాంటి స్కూళ్లకు నోటీసులిస్తాం. 

పర్మిషన్​ ఉన్న పేరుతోనే స్కూళ్లు నడపాలి..

ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యాలు ఏ పేరుతో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారో తప్పకుండా ఆ పేరుతోనే పాఠశాలలను నిర్వహించాలి. స్కూల్ బోర్డుల్లో, ప్రచార ఫ్లెక్సీలు, హోర్డింగ్ ల్లో ఆ పేర్లనే ఉపయోగించాలి. టెక్నో, హైటెక్​, గ్లోబల్ పేర్లతో విద్యార్థులను, పేరెంట్స్​ ను మభ్యపెట్టడం తప్పు. అలాంటి స్కూళ్లను గుర్తించి వాటికి నోటీసులు జారీ చేస్తాం.