పల్లెల్లో ఉపాధి బాట!

పల్లెల్లో ఉపాధి బాట!
  • ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
  • 12 వేల వ్యవసాయ క్షేత్రాలకు మట్టి రోడ్లు.. 2,598 కిలో మీటర్లు సీసీ రోడ్ల నిర్మాణం
  • 2024 – 25లో 12.23 కోట్లు పని దినాలు కల్పించని రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పల్లెల్లో ‘ఉపాధి’కి బాటలు పడుతున్నాయి. ఉపాధి హామీలో గతేడాది కంటే ఈసారి ఎక్కువ పనులు చేసి గ్రామీణ ప్రజలకు జీవనోపాధితో పాటు ఆర్థిక చేయూత అందించింది. రాష్ట్రంలో ఈ పథకంలో పల్లెలను అనుసంధానించేలా పలు పనులు చేపట్టారు. ఇందులో భాగంగా వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 12,010 వ్యవసాయ క్షేత్రాలకు రోడ్లను నిర్మించడంతో రైతుల బాట కష్టాలు తప్పాయి. 

12,247 వేల పశువుల షెడ్లు, భవిష్యత్‌‌‌‌లో నీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సేకరణ కోసం 1,224 రూప్ టాప్‌‌‌‌లను నిర్మించింది. 2,598 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించింది, వ్యవసాయ అనుబంధ యూనిట్లలో భాగంగా ఫౌల్ట్రీ షెడ్లు 500, మేకలు గొర్రెల షెడ్లు 1,551, అజోల్లా ఉత్పత్తి యూనిట్లు 453, ఎన్ఏడీఈపీ- వర్మి కంపోస్టు యూనిట్లు 1,187, ఫారం పాండ్లు 5,026 నిర్మించారు. రాష్ట్రంలోని పలు స్కూళ్లల్లో​5,827 మరుగుదొడ్లు నిర్మించారు. 3,366 స్కూల్ కాంపౌండ్ వాల్స్, 2401 కిచెన్ షెడ్లు ఏర్పాటు చేశారు. 127 బోర్ వెల్ రీచార్జ్ స్ట్రక్షర్, 154 చెక్ డ్యామ్​లు, 2,811 పెర్కోలేషన్ ట్యాంకులు నిర్మించారు. కాగా, రాష్ట్రంలో 2024–-25 సంవత్సరంలో రూ.4,529.07 కోట్లతో పనులు చేపట్టారు. ప్రజలకు 12.23 కోట్ల పని దినాలు కల్పించారు. సగటున 45.82 రోజులు ఉపాధి కల్పించారు. ఒకరికి సగటు కూలీ రూ.213 అందించారు. వేతనాల కోసమే రూ.2,614.3 కోట్లు, మెటీరియల్ వ్యయం రూ.1,685.52 కోట్లు, అడ్మిన్ వ్యయం రూ.229.25 కోట్లు కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. 

వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం.. 

పల్లెల్లో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఉపాధి హామీలో వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. పశువుల షెడ్లు, ఫౌల్ట్రీ షెడ్లు, గొర్రెల, మేకల షెడ్లతో పాటు వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మిస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024-–25లో 12.23 కోట్ల పనిదినాలు కల్పించాం. పల్లె వాసులు వలస వెళ్లకుండా గ్రామాల్లో పనులు కల్పించేలా చర్యలు చేపట్టి, వారికి ఆర్థికంగా చేయూతనిస్తున్నాం.- సీతక్క, పంచాయతీ రాజ్‌‌‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి