ఏజీఎం వరకూ ప్రెసిడెంట్ పోస్టులోనే బిన్నీ

ఏజీఎం వరకూ ప్రెసిడెంట్ పోస్టులోనే బిన్నీ

బెంగుళూరు: నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ మరికొంత కాలం తన పదవిలో కొనసాగనున్నారు. గత నెలలో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బిన్నీ ఈ బిల్లు ప్రకారం సెప్టెంబర్ లో జరగబోయే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వరకు ప్రెసిడెంట్‌‌గా ఉంటారు. తాజా బిల్లు ప్రకారం  నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ల ఆఫీస్ బేరర్ల కటాఫ్ ఏజ్‌‌ను 75 సంవత్సరాలుగా నిర్ణయించారు. దీంతో బీసీసీఐ మెంబర్స్ అంగీకరిస్తే 1983 వరల్డ్ కప్‌‌ విన్నింగ్ హీరో అయిన బిన్నీ 75 ఏండ్ల  వరకు పదవిలో ఉండొచ్చు.  

ఈ విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో ప్రత్యేక కటాఫ్ ఏజ్‌‌ రూల్ లేదు. ‘బిన్నీ సెప్టెంబర్ లో జరిగే బోర్డు సమావేశం వరకు పదవిలో కొనసాగుతారు. ఆయనకు కొత్త  టర్మ్  లభిస్తుందా అనేది సభ్యులు, బోర్డులోని పెద్దల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా, జాతీయ క్రీడా బిల్లు పరిధిలోకి బీసీసీఐ వచ్చినప్పటికీ, ప్రభుత్వ నుంచి ఎటువంటి గ్రాంటును తీసుకోనందున బోర్డుకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) వర్తించదు. 

బీసీసీఐ లీగల్ టీమ్ ప్రస్తుతం బిల్లులోని నిబంధనలను పరిశీలిస్తోంది. ‘జాతీయ క్రీడా బిల్లుకు ఇప్పుడే ఆమోదముద్ర పడింది. దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి, సరైన చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం’ అని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ఆడుతున్నందున ఈ బిల్లు గురించి సీనియర్ ప్లేయర్లు, కోచింగ్ సిబ్బందితో కూడా సంప్రదిస్తామని పేర్కొన్నారు. కాగా, రోజర్ బిన్నీ 2022 అక్టోబర్ లో ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ ప్రెసిడెంట్‌‌గా బాధ్యతలు చేపట్టారు.