కామెడీ జానర్ నుంచి రూటు మార్చి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్.. తిరిగి తన మార్క్ వినోదంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం నుంచి తొలిపాటను విడుదల చేశారు.
‘నా కంటి మీద కునుకే’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేయగా ధనుంజయ్ సీపాన పాడాడు. ‘‘నీ మాటే సరిగమ, నీ వెంటే స్వర్గమా.. నా చెయ్యే నీ చెయ్యితో జట్టు కట్టమన్నదే.. చుక్కల మాలికవా, చక్కని పోలికవా.. మనసే నాది చప్పుడు నీదమ్మా.. ”అంటూ భాస్కరభట్ల రవికుమార్ రాసిన సాహిత్యం ఆకట్టుకుంది.
జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీలో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. అల్లరి నరేష్, సురభి ఆన్ స్క్కీన్ కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది.
