కురుస్తున్న స్కూళ్లు ! ప్రభుత్వ పాఠశాలల్లో పైకప్పు లీకేజీలు.. విద్యార్థులకు ఇబ్బందులు

కురుస్తున్న స్కూళ్లు !  ప్రభుత్వ పాఠశాలల్లో పైకప్పు లీకేజీలు..  విద్యార్థులకు ఇబ్బందులు
  • కొత్తగూడెం జిల్లాలో126 స్కూళ్లలో రూఫ్​ లీకేజీ.. శిథిలావస్థలో 233 క్లాస్​ రూమ్స్..  

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వరుసగా వానలు పడుతున్న వేళ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల బిల్డింగ్స్​ రూఫ్​ లీకేజీలతో స్టూడెంట్స్​ అవస్థలు పడుతున్నారు. కురుస్తున్న చోట బకెట్లు పెట్టి పక్కానే చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. లీకేజీలతో పై కప్పు నుంచి ఎప్పుడు పెచ్చులు ఊడి పడతాయోననే భయాందోళనల మధ్య విద్యార్థుల చదువులు 
కొనసాగుతున్నాయి. 

126 స్కూళ్లలో కురుస్తున్న పై కప్పులు.. 

ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు జిల్లాలోని చాలా  ప్రభుత్వ స్కూళ్లలో​పై కప్పు లీకేజీలు అవుతున్నాయి. కురుస్తున్న క్లాస్​ రూమ్​ల్లో బకెట్లు పెట్టడం కామన్​గా మారింది. పై కప్పు లీకేజీలపై విద్యాశాఖ, ఇంజనీరింగ్​ శాఖాధికారులు ఇటీవల సర్వే నిర్వహించారు. 126 స్కూళ్లలలో పై కప్పు లీకేజీలతోపాటు 233 క్లాస్​ రూమ్స్  శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. మరో వైపు పై కప్పు నుంచి ఎప్పుడు పెచ్చులు ఊడి పడుతాయోననే భయం నెలకొంది. 

కలెక్టర్​ దృష్టికి రూఫ్​ లీకేజీలు.. 

గవర్నమెంట్​ స్కూళ్లలో రూఫ్​ లీకేజీల సమస్య కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​ దృష్టికి వెళ్లింది. క్లాస్​ రూమ్స్​ డ్యామేజ్, పైకప్పు లీకేజీలపై విద్యాశాఖ నుంచి కలెక్టర్​ వివరాలు ఇప్పటికే తెప్పించుకున్నారు. రిపేర్లపై యుద్ధ ప్రాతిపదికన  ప్రపోజల్స్​ తయారు చేయాలని ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్​ బీ, ట్రైబల్​ వెల్ఫేర్​ , టీఎస్​ఈ డబ్ల్యూ ఐడీసీ శాఖలకు చెందిన ఇంజినీరింగ్​అధికారులను ఆయన ఆదేశించారు.