- వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన యూపీ వారియర్స్
- రాణించిన స్మృతి, డిక్లెర్క్, శ్రేయంక దీప్తి, డాటిన్ శ్రమ వృథా
నవీ ముంబై: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. లక్ష్య ఛేదనలో గ్రేసీ హారిస్ (40 బాల్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 85), కెప్టెన్ స్మృతి మంధాన (32 బాల్స్‌లో 9 ఫోర్లతో 47 నాటౌట్) చెలరేగడంతో.. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ 20 ఓవర్లలో 143/5 స్కోరు చేసింది. దీప్తి శర్మ (45 నాటౌట్), దియోంద్ర డాటిన్ (40 నాటౌట్) రాణించారు. తర్వాత బెంగళూరు 11.4 ఓవర్లలోనే 145/1 స్కోరు చేసింది. యూపీ బౌలింగ్‌లో పస లేకపోవడంతో హారిస్ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడింది. రెండో ఎండ్‌లో మంధానా కూడా బ్యాట్ ఝుళిపించడంతో పవర్‌ప్లేలో ఆర్సీబీ 78/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. 22 బాల్స్‌లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్న హారిస్ లాంగాన్, లాంగాఫ్, మిడ్ వికెట్ మీదుగా ఐదు భారీ సిక్సర్లు సంధించింది. రెండో ఎండ్‌లో మంధానా కూడా వీలైనప్పుడల్లా ఫోర్లు దంచింది. ఈ క్రమంలో 10 ఓవర్లలో 121/0 స్కోరుతో నిలిచిన బెంగళూరుకు 12వ ఓవర్‌లో శిఖా పాండే (1/28) తొలి ఝలక్ ఇచ్చింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న హారిస్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌కు 137 రన్స్ భాగస్వామ్యాన్ని ముగించింది. తర్వాత రిచా ఘోష్ (4 నాటౌట్)తో కలిసి మంధానా మరో 47 బాల్స్ మిగిలి ఉండగానే ఈజీగా విజయాన్ని అందించింది. హారిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కీలక భాగస్వామ్యం..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూపీని బెంగళూరు బౌలర్లు బాగా కట్టడి చేశారు. స్టార్టింగ్ నుంచే శ్రేయంకా పాటిల్ (2/50), నదైన్ డిక్లెర్క్ (2/28), లారెన్ బెల్ (1/16) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో ఓపెనర్లు మెగ్ లానింగ్ (14), హర్లీన్ డియోల్ (11) కుదురుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఈ క్రమంలో బాల్స్ ఎక్కువగా వృథా చేయడంతో స్కోరు ముందుకు సాగలేదు. ఐదో ఓవర్‌లో డియోల్ ఔట్ కావడంతో పవర్‌ప్లేలో యూపీ 36/1 స్కోరు చేసింది. ఈ దశలో లానింగ్‌తో కలిసిన ఫోబీ లిచ్‌ఫీల్డ్ (20) వేగంగా ఆడింది. అయితే ఎనిమిదో ఓవర్‌లో శ్రేయంక డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. ఆరు బాల్స్ తేడాలో లానింగ్, లిచ్‌ఫీల్డ్‌ను పెవిలియన్‌కు పంపింది. 9వ ఓవర్‌లో డిక్లెర్క్ కూడా వరుస బాల్స్‌లో కిరణ్ నవ్‌గిరే (5), శ్వేత షెరావత్ (0) వికెట్లు తీసింది. ఫలితంగా యూపీ 50/5తో కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి దీప్తి, డాటిన్ ఆర్సీబీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టారు. ఈ క్రమలో ఆరో వికెట్‌కు 72 బాల్స్‌లోనే 93 రన్స్ జోడించారు. ఫస్ట్ టెన్‌లో 56/5తో ఉన్న జట్టుకు తర్వాతి పది ఓవర్లలో 87 రన్స్ అందించి మంచి టార్గెట్‌ను నిర్దేశించారు.
సంక్షిప్త స్కోర్లు
యూపీ: 20 ఓవర్లలో 143/5 (దీప్తి 45*, డాటిన్ 40*, డిక్లెర్క్ 2/28, శ్రేయంక 2/50). బెంగళూరు: 11.4 ఓవర్లలో 145/1 (హారిస్ 85, స్మృతి 47*, శిఖా పాండే 1/28).
