రోజ్ గార్ మేళాతో 5 లక్షల మందికి ఉద్యోగాలు: కిషన్ రెడ్డి

రోజ్ గార్ మేళాతో 5 లక్షల మందికి ఉద్యోగాలు:  కిషన్ రెడ్డి

పద్మారావునగర్, వెలుగు: రోజ్​గార్​ మేళాతో దేశవ్యాప్తంగా మొత్తం 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్​ బోయిగూడ రైల్​ కళారంగ్​లో జరిగిన 7వ రోజ్​ గార్​ మేళాలో ఆయన పాల్గొని.. ఐటీ, బ్యాంకింగ్, పోస్టల్​ రంగాలతో పాటు మొత్తం 10 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 176 మంది అభ్యర్థులకు అపాయింట్​ మెంట్​ లెటర్లు అందజేశారు.

ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు గర్వించేలా దేశం కోసం పనిచేయాలని కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి పిలుపునిచ్చారు. యూత్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియానే నంబర్​ వన్​ అని అన్నారు. నేటి యువత మేథస్సు రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేలా భారత్​ రూపు దిద్దుకుంటుందన్నారు. 2022, అక్టోబర్ 22న దేశ యువతకు దీపావళి కానుకగా ప్రధాని మోదీ ‘రోజ్ గార్ మేళా’ను ప్రారంభించారని గుర్తు చేశారు. నెలకు 70 వేల చొప్పున యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, ఈ మేళాను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నమని చెప్పారు.