తమిళనాడులో రూ.కోటిన్నర సీజ్ : ఓటర్ కు రూ.300

తమిళనాడులో రూ.కోటిన్నర సీజ్ : ఓటర్ కు రూ.300

లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉపఎన్నికల వేళ.. తమిళనాడులో నోట్ల కట్టలు.. గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. ఐటీ దాడులు, పోలీసుల తనిఖీలు.. ధన ప్రవాహాన్ని ఆపలేకపోతున్నాయి. వెల్లూరులో ఐటీ దాడుల్లో గత నెలాఖరులో దాదాపు రూ.12కోట్లు పట్టుబడటంతో… అక్కడ లోక్ సభ ఎన్నికను రద్దు చేసింది ఎలక్షన్ కమిషన్. రెండో దశ ఎన్నికలకు ముందు మొత్తం 13 ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందాలు తమిళనాడు వ్యాప్తంగా నేతల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు.

అండిపట్టి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికలు 18న జరగనున్నాయి. మంగళవారం రాత్రి… అండిపట్టిలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ పార్టీ నాయకుడి ఇంటిపై మంగళవారం రాత్రి ఐటీ అధికారులు దాడులు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్ అనుచరుడైన ఈ నేత ఇంట్లో రూ.కోటిన్నర నగదు దొరికింది. మొత్తం 94 ప్యాకెట్లలో ఆ డబ్బును ప్యాక్ చేసి పెట్టారు. ఒక్కో ప్యాకెట్ పై .. డబ్బులు ముట్టాల్సిన వార్డ్ మెంబర్ పేరు… ఆ వార్డ్ లోని ఒక్కో ఓటర్ కు రూ.3వందలు అందాలన్నట్టుగా రాసి ఉంది.

ఐటీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలకు వచ్చినప్పుడు దినకరన్ పార్టీ AMMK నాయకులు.. వారిపై దాడికి ప్రయత్నించారు. సర్చ్ వారెంట్ తో వచ్చామని చెప్పిన అధికారులతో గొడవకు దిగారు. కొందరు పార్టీ నాయకులు గుంపులుగా వచ్చి.. అధికారులు సీజ్ చేసిన డబ్బు ప్యాకెట్లను లాక్కునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అధికారులకు రక్షణ కల్పించి అక్కడినుంచి తీసుకెళ్లారు.

అండిపట్టిలో రెయిడ్ ఆపరేషన్ ఉదయం 5.30కు జరిపారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. డబ్బు ప్యాకెట్లపై ఉన్న వార్డులన్నీ అండిపట్టి సెగ్మెంట్ కు సంబంధించినవే అనీ.. ఈ మొత్తం ఆపరేషన్ పై రిపోర్టును ఈసీకి పంపించామని సీనియర్ ఇన్ కంటాక్స్ అధికారి బి.మురళీ కుమార్ చెప్పారు.